విశాఖ వాసులకు శుభవార్త... ఆ కల నెరవేర్చబోతున్న జగన్ సర్కార్....?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కార్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన ప్రభుత్వం బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నా రాజధాని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. విశాఖలో రైలు ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లైట్‌ మెట్రో రైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేస్తోంది. 
 
ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అర్బన్ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌కు డీపీఆర్ బాధ్యతలను అప్పగించింది. ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి లైట్ మెట్రోతో పోలిస్తే చాలా తక్కువ మొత్తం ఖర్చు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక కిలోమీటర్ ట్రామ్ కారిడార్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. లైట్‌ మెట్రో రైలు కారిడార్‌ నిర్మాణానికి కిలోమీటర్ కు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 
 
లైట్‌ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ నవంబర్ నెలాఖరు నాటికి సిద్ధం కానుండగా ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ డిసెంబర్ నెలాఖరుకల్లా సిద్ధం కానుంది. బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్‌ దేశాల నుంచి ట్రామ్ కు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అధికారులు డీపీఆర్ సిద్ధమైన తరువాత అంచనా వ్యయాల్లో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌లు సిద్ధమవుతాయని అధికారులు భావిస్తున్నారు. 
 
డీపీఆర్ లు సిద్ధమైన తరువాత ప్రభుత్వం వాటిని అధ్యయనం చేసి బిడ్డింగ్ కు వెళ్లనుంది. పనులు అనుకున్న ప్రకారం జరిగితే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తి కావడంతో పాటు 2021 జూన్‌ నాటికి లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024 నాటికి లైట్ మెట్రో పరుగులు తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖ వాసుల కలను నెరవేర్చటానికి జగన్ సర్కార్ ఎంతో కృషి చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: