ఆ జంతువు నుంచే మనుషులకు సోకిన కరోనా.... శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో ఏం తేలిందంటే....?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్ ప్రజల్లో భయాందోళనను పెంచుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వైరస్ ను నియంత్రించటం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. 
 
2019 డిసెంబర్ నుంచి ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ కు మూలం ఏమిటి...? అనే ప్రశ్న ప్రపంచ దేశాలను వేధిస్తోంది. గతంలో చైనా వుహాన్ లోని ప్రభుత్వ ప్రయోగశాల నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు వైరస్ గురించి అధ్యయనం చేసేందుకు చైనాకు వెళ్లారు. గతంలో చైనీయులు గబ్బిలాలను తినడం వల్ల వైరస్ సోకిందని వార్తలు రాగా తాజా అధ్యయనం దీన్ని బలపరుస్తోంది. 
 
పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ డైనమిక్స్‌కు చెందిన మాసిజ్ బోని నేతృత్వంలోని పరిశోధకులు హార్స్ షూ గబ్బిలాలు కరోనా వైరస్ మనుషులకు సోకటానికి కారణమని తేల్చారు. నేచర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. పరిశోధకులు వైరస్ మూలాలను గుర్తించడం వల్ల భవిష్యత్తులో వ్యాధికారక జంతువుల నుంచి ప్రజలను వేరు చేయవచ్చని... ఆరోగ్య సంక్షోభాలను నివారించవచ్చని చెబుతున్నారు. 
 
గతంలో పరిశోధకులు కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు అలుగుకు సోకి, వాటి నుంచి మనుషులకు వ్యాపించిందని భావించారు. అయితే తాజాగా అధ్యయనం చేసిన పరిశోధకులు మాత్రం అలుగులు వైరస్ వాహకంగా పని చేయలేదని తేల్చారు. మరోవైపు భారత్ లో ప్రతిరోజూ 50,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్యపరంగా తాజాగా మరో రికార్డు నమోదైంది. నిన్నటి కేసులతో కరోనా కేసుల సంఖ్య 15 లక్షల మార్కును దాటేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: