వాళ్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త... 90 శాతం వడ్డీ మాఫీ....?

Reddy P Rajasekhar

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. కరోనా, పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ వల్ల పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి తరుణంలో మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆస్తి పన్ను చెల్లించేవారికి శుభవార్త చెప్పారు. 
 
తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ సహా పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓటీఎస్‌ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వం కేటీఆర్ సూచనలతో ప్రాపర్టీ టాక్స్‌పై వడ్డీ భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీ టాక్స్‌పై వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం కింద కేవలం 10 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. 2019 - 20 ఆస్తి పన్ను మొత్తాన్ని 10 శాతం వడ్డీతో చెల్లించిన వాళ్లకు 90 శాతం వడ్డీ మాఫీ కానుంది. 
 
అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు 45 రోజుల పాటు ఆస్తిపన్ను చెల్లించే వాళ్లు మాత్రమే 10 శాతం వడ్డీతో ఆస్తి పన్నును చెల్లించవచ్చు. చాలా సంవత్సరాల నుంచి ఆస్తిపన్ను చెల్లించని వాళ్లకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదున్నర లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీళ్లు 1477 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 
 
కరోనా కష్ట కాలంలో వన్ టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం అమలు ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరడంతో పాటు మొండి బకాయిలు వసూలవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1610 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏపీతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా భారీగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: