తెలంగాణ ఆరోగ్య శాఖ కరోనా లెక్కలు !
తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఒక్కరోజే 1600కు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 57 వేలు దాటింది. రాష్ట్రంలో ఎన్ని బెడ్ లు అందుబాటులో ఉన్నాయో కూడా.. బులిటెన్ లో విడుదల చేసింది ఆరోగ్య శాఖ.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1610 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 57 వేల 142కు పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 531 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 480కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని మరో 803 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్ఛార్జి అయిన వారి సంఖ్య 42 వేల 909కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13వేల 753గా ఉంది.
కరీంనగర్ జిల్లాలో 48 కేసులు, జోగులాంబ గద్వాల జిల్లాలో 340 కేసులు, ఖమ్మం లో 26 కేసులు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 23 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 113 కేసులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 32 కేసులు, నల్గొండ జిల్లాలో 26 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 58 కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 172 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 48 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 152 కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 25 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 74 కేసులు, సూర్యాపేట జిల్లాలో 35 కేసులు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 59 పేజీలతో కరోనా బులెటిన్ విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలతో బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు కూడా ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 55 ప్రైవేట్ ఆస్పత్రుల్లో 4 వేల 497 బెడ్ లు ఉన్నాయి. 3 వేల 32 బెడ్ లు ఫుల్ కాగా.. ఇంకా 1465 బెడ్ లుఖాళీగా ఉన్నాయి.