విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.... రేపటినుంచి ఏపీ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం...?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చెబుతోంది. ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంపై వైరస్ ప్రభావం ఎక్కువగా పడింది. మార్చి నెల మూడవ వారంలో మూతబడిన పాఠశాలలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతబడిన పాఠశాలలు త్వరలో తిరిగి తెరచుకోనున్నాయి. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను తిరిగి తెరవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
సాధారణంగా జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 - 21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ అకాడమిక్ క్యాలండర్ లో రేపటి నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్‌లో కొన్ని ప్రధానాంశాలను పొందుపరిచింది.
అడ్మిషన్ల సందర్భంగా పాఠశాలలకు కేవలం విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే రావాలని... ప్రతి ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి పాఠశాలకు హాజరు కావాలని... ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది. ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలని... పాఠ్యాంశాలకు ఆన్‌లైన్ బోధన అవకాశం ఇస్తున్నామని పేర్కొంది.
విద్యార్థులను ఆన్‌లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్), రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న వారు(లోటెక్), ఏవీ అందుబాటులో లేనివారు (నోటెక్) గా విభజించాలని పేర్కొంది. ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి అనుమతి లేదని... టీసీ అడిగితే ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా ఇవ్వాలని... సంబంధిత ఎమ్మార్వో, డిప్యూటీ ఈవో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌లో సూచించిన విధంగా ప్రతి టీచర్ రోజూ కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా కార్యక్రమాల గురించి వివరించాలని ప్రభుత్వం పేర్కొంది.