భూములు కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఆగస్ట్ 1 నుంచి భారీ పెంపు...?

Chakravarthi Kalyan

చాలా మంది తమ మిగులు ఆదాయాన్ని భూముల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడి పెడుతుంటారు. భూమి అయితే ఎవరూ దొంగిలించలేని ఆస్తి. అందులోనూ భూముల ధరలు పెరగడమే తప్ప తగ్గటం అంటూ సాధారణంగా ఉండదు. ఐతే.. మనం భూమి కొన్నప్పుడు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరను పట్టి పన్ను కట్టాలి.  


అయితే.. ఆగస్ట్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలు, నగరాల్లోని ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, అపార్టుమెంట్ల భూముల మార్కెట్‌ విలువలను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల డిమాండును బట్టి కనీసం 5 నుంచి 50 శాతం పైగా మార్కెట్ విలువను పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. 


అయితే ఇప్పటి వరకూ ఉన్న మార్కెట్‌ విలువలను సవరించేందుకు అప్పటి వరకు వచ్చిన రెవెన్యూ, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌, ఆయా ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని నెలలుగా కరోనా వైరస్‌ భయంవల్ల రియల్ ఎస్టేట్ కూడా బాగా మందగించింది. ఏప్రిల్‌, మే నెలల్లో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గాయి. అయినా మార్కెట్‌ విలువల పెంచాలనే ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. 


ప్రభుత్వానికి నిత్యం ఆదాయం తెచ్చి పెట్టే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధానమైంది. మద్యం అమ్మకం తర్వాత అధిక ఆదాయం ఈ శాఖ నుంచే వస్తుంది. కరోనా కారణంగా ఇటీవల రాష్ట్ర ఆదాయం పడిపోయిన నేపథ్యంలో దాన్ని కాస్త పూడ్చుకునేందుకు భూముల మార్కెట్ విలువ పెంచుతున్నారనే విశ్లేషణలూ ఉన్నాయి. అందుకే భూములు కొనాలనుకునేవారు... ఆగస్టు 1 లోపు కొంటే పాత మార్కెట్ ధరకే కొనుగోలు పూర్తవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: