ఏపీలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్... వీళ్లే కొత్త మంత్రులు....?

Reddy P Rajasekhar

గత కొన్ని రోజులుగా ఏపీ కేబినెట్ విస్తరణ గురించి భారీస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఈ స్థానాలను జగన్ భర్తీ చేస్తున్నారు. సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా జగన్ రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయనున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టి బలిజ వర్గానికి చెందినవారు కాగా మోపిదేవి మత్స్యకార వర్గానికి చెందినవారు. 
 
శెట్టిబలిజ సామజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు మంత్రి పదవి ఖరారైంది. 2019 ఎన్నికల్లో తొలిసారి ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కేబినెట్‌లో జగన్ అవకాశం ఇచ్చారు. ఈయన గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా వీళ్లకు మంత్రి పదవులు దక్కాయి. 
 
అధికార పార్టీ వర్గాలు శాఖల విషయంలో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని చెబుతున్నాయి. అప్పలరాజుకు పశుసంవర్ధక శాఖ, వేణుకు రెవిన్యూ శాఖ దక్కే అవకాశం ఉందని సమాచారం. జగన్ సర్కార్ ధర్మాన కృష్ణదాస్ ను ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. 
 
గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో రాజ్ భవన్ లో ప్రమాణం చేయించనున్నారు. సీఎం జగన్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను జగన్ సర్కార్ ఖరారు చేసింది. రాయచోటికి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజుకు ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: