ఏపీ రేషన్ డీలర్లకు జగన్ సర్కార్ షాక్ ఇవ్వబోతుందా....?

Reddy P Rajasekhar

ఏపీ రేషన్ డీలర్లు జగన్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చారు. మెరుపుసమ్మెకు దిగి రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరగకుండా చేశారు. న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వం స్పందించి హామీ ఇస్తే మాత్రమే సరుకులు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో ఈ నెల 20 నుంచి ఎనిమిదో విడత రేషన్ పంపిణీ చేపట్టబోతున్నట్టు ప్రకటన చేసింది. 
 
అయితే కరోనా కష్ట కాలంలోనూ తాము పేదలకు రేషన్ పంపిణీ చేశామని న్యాయంగా తమకు రావాల్సిన కమీషన్ ప్రభుత్వం చెల్లించడం లేదని... కరోనా వారియర్స్ గా గుర్తించి తమకు బీమా సౌకర్యం కల్పించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వేలి ముద్రల నిబంధనను ఎత్తివేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటివరకు ఆరుగురు డీలర్లు మరణించారని వాళ్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
అధికారులు సమస్యలను విన్నవించినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే జగన్ సర్కార్ భవిష్యత్తులో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో రేషన్ డీలర్లు మెరుపుసమ్మెకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండటంతో వాళ్లలో రేషన్ డీలర్లపై వ్యతిరేకత వస్తోంది. 
 
ప్రభుత్వం రేషన్ డీలర్ల విషయంలో కఠినంగా వ్యవహరించి ఉద్యోగాల్లోంచి తొలగిస్తే మాత్రం వీళ్లే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొందరు రాజకీయ లబ్ధి కోసం రేషన్ డీలర్ల చేత సమ్మె చేయిస్తున్నారని ఇలా చేయడం వల్ల నష్టపోయేది రేషన్ డీలర్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ గతంలో రేషన్ డీలర్లను తొలగించాలని భావించినా తర్వాత వెనక్కు తగ్గింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: