గంటా మళ్ళీ మార్చేస్తారా? ఆ ప్రత్యర్ధి నేతకు బాబు అవకాశం ఇస్తారా?
గంటా శ్రీనివాసరావు...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. వరుసగా పార్టీలు మార్చినా, నియోజకవర్గాలు మార్చినా కూడా గెలుపు సొంతం చేసుకోవడం గంటాకు వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితం మొదలుపెట్టిన గంటా ఓ సారి అనకాపల్లి ఎంపీగా, ఓ సారి చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యంలోకి వచ్చి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో కలవడంతో అప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వడంతో మళ్ళీ టీడీపీలోకి వచ్చేసి, 2014 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో, పార్టీలోనూ మెరుస్తూ, మిగతా సమయం ఇంటికే పరిమితమవుతున్నారు.
ఈ క్రమంలోనే గంటా పార్టీ మారిపోతారని పలుసార్లు వార్తలు వచ్చాయి. ఓ సారి బీజేపీలోకి, ఓ సారి వైఎస్సార్‌సీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ గంటా మాత్రం ఇంకా ఎటు వెళ్లకుండా సైలెంట్ గా ఉన్నారు. ఒకవేళ పార్టీ మారితే చెప్పలేం గానీ, లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో గంటా మళ్ళీ నియోజకవర్గం మార్చడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇదే తరుణంలో గంటా గనుక నియోజకవర్గం మారితే, విశాఖ నార్త్‌లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుని టీడీపీలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
2014లో టీడీపీతో పొత్తుతో విష్ణు బీజేపీ తరుపున పోటీ చేసి విశాఖ నార్త్ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీలోకి రావడానికి ప్రయత్నించారు గానీ, గంటా నార్త్ సీటులోకి రావడంతో, మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో బీజేపీ తరుపున పోటీ చేసి కొద్దోగొప్పో మంచిగా ఓట్లు తెచ్చుకుంది విష్ణునే. ఒకవేళ నెక్స్ట్ గనుక టీడీపీతో పొత్తు ఉంటే విష్ణుకు ఇబ్బంది లేదు. అలా కాకపోతే ఈసారి మాత్రం విష్ణు టీడీపీలోకి రావడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. గంటా ఎలాగో నియోజకవర్గం మారితే, విష్ణు నెక్స్ట్ టీడీపీ తరుపున బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి వచ్చే ఎన్నికలకు పరిస్థితి ఎలా మారుతుందో?