ఏపీ స్పీకర్ గా ఆయన ఫైనల్ ?

మరికొద్ది రోజుల్లో ఏపీ కేబినెట్ ప్రక్షాళన జరగడం ఖాయంగా తేలడంతో, అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద హడావుడినే జరుగుతోంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎవరూ ఊహించని విధంగా మంత్రిమండలిని నియమించారు. సామాజిక వర్గాల సమతూకంలో పదవులు కేటాయించారు. ఇప్పుడు మరోసారి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేపట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ పదవులకు రాజీనామా చేయబోతున్నారు. వారి స్థానంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సిదిరి  అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ కృష్ణ పేరు తెరమీదకు వచ్చాయి. వీరే కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రులను కొంతమందిని తప్పించి వేరే  వారికి అవకాశం ఇవ్వాలని జగన్ చూస్తున్నారు. ప్రస్తుతం ఏపీ స్పీకర్ గా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం మంత్రి అవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 

 


మంచి వాగ్దాటి కావడం, రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడంలోనూ, తనదైన శైలిలో దూకుడుగా ఉంటూ ఉంటారు. అదీ కాకుండా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దూకుడు ఎక్కువగా ఉండడం, పదేపదే వైసీపీని టార్గెట్ చేసుకుంటూ ఆయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆయన దూకుడుకు బ్రేకులు వేసే విధంగా తమ్మినేని కి మంత్రి పదవి కేటాయించాలనే అభిప్రాయం జగన్ అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ స్పీకర్ గా గుంటూరు జిల్లాకు చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతికి అవకాశం ఇవ్వబోతున్నట్టు పార్టీలో కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

 

దాదాపు ఆయన స్పీకర్ అవ్వడం ఖాయమని వారు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఆయన తండ్రి కోన ప్రభాకరరావు ఉమ్మడి ఏపీకి స్పీకరుగా పనిచేశారు. సీనియర్ నాయకుడిగా, మంచి వ్యక్తిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వైసీపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెంచే విధంగా రఘుపతికి స్పీకర్ పదవిని కట్టబెడితే సామాజిక సమతూకం సరిపోతుందని, ఆ వర్గం నుంచి కూడా తమకు మద్దతు ఉంటుందనే అభిప్రాయంలో జగన్ ఉన్నారట.

 


 వివాదరహితుడిగా ఉన్న కోన రఘుపతి కి స్పీకర్ పదవి ఇస్తే ఆ స్థానానికి కూడా గౌరవం తెచ్చినట్లు అవుతుందని, ఆయనెప్పుడూ వివాదాల్లో తలదూర్చకుండా, పార్టీ నియమ, నిబంధనలు పాటిస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో, ఆయనకు ఆ పదవి ఇస్తే పార్టీకి, ఆ పదవికి కూడా గౌరవం పెరుగుతుంది అనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: