కరోనా సోకినా ఫలితాల్లో నెగిటివ్ రావడానికి కారణాలివే....?
కరోనా వైరస్ విజృంభణ వల్ల దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరికి ఒక ల్యాబ్ లో కరోనా నిర్ధారణ కాగా మరో ల్యాబ్ లో నెగిటివ్ గా నిర్ధారణ అవుతోంది. మరికొందరిలో లక్షణాలు కనిపించటంతో మొదట నెగిటివ్ నిర్ధారణ కాగా తరువాత పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. పరీక్షల ఫలితాలు బాధితులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
అయితే వైద్యులు మాత్రం నమూనాల సేకరణ నుంచి వాటిని నిల్వ చేయడం, పరీక్షించడం వరకు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని.... కరోనా సోకినా నెగిటివ్ రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. ఆర్టీ పీసీఆర్ విధానంలో గొంతు నుంచి సేకరించిన నమూనాల ద్వారా ప్రయోగశాలలో పరీక్షలు జరుపుతారు. ఇందులో వైరల్ లోడ్ తీవ్రతను బట్టి వైరస్ నిర్ధారణ అవుతుంది.
సాధారణంగా బాధితుల నుంచి నమూనాలు సేకరించే సమయంలో గొంతు పై భాగం నుంచి సేకరిస్తే వైరస్ సోకినా ఫలితం నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వైరస్ సోకిన 4 - 7 రోజుల్లో వైరస్ తీవ్రత పెరుగుతుంది. అలాంటి సమయంలో వైరస్ సోకినా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి శరీరంలో ఉండే యాంటీబాడీల వల్ల వైరస్ సోకినా తీవ్రత తగ్గి నెగిటివ్ రావచ్చు.
లక్షణాలు లేని వారిలో వైరస్ తీవ్రత త్వరగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ విషయంలో పరీక్షలు చేసే సిబ్బంది పాత్ర కీలకం. నమూనాను నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువగా వేసి పరీక్షించినా నెగిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమూనాలను నిర్ణీత ఉష్ణోగ్రతలో ఉంచకపోయినా ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి.