ఈ యాప్ తో ఒకే సారి 300 మందికి వీడియో కాల్..!
కరోనా దెబ్బతో వర్క్ ఫ్రం హోమ్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వర్చువల్ మీటింగ్లకే సంస్థలన్నీ మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో వీడియో కాలింగ్ యాప్‌లకు డిమాండ్ ఎక్కువైంది. ముఖ్యంగా యూజర్లను ఆకట్టుకునేందుకు జూమ్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. అందుకే వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు మైక్రోసాఫ్ట్ మెరుగైన ఫీచర్‌తో వస్తోంది. దాని విశేషాలివే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల హవా నడుస్తోంది. విపరీతంగా వినియోగదారులు పెరగడం వల్ల జూమ్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఎన్నో సంస్థలు యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే దూసుకెళ్తోన్న 'మైక్రోసాఫ్ట్ టీమ్స్'ను మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది మైక్రోసాఫ్ట్. ఇందులో భాగంగా ఒకేసారి 300 మంది వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయ్యే సదుపాయాన్ని తెస్తున్నట్లు ప్రకటించింది.
సాధారణంగా వీడియో కాలింగ్ యాప్‌లలో పదుల సంఖ్యలోనే యూజర్లు కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే పెద్ద కళాశాల, సంస్థలను తీసుకుంటే ఎక్కువ మంది విద్యార్థులు, సిబ్బందిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న 250 మంది పరిమితిని మరో 20 శాతం పెంచింది. ఫలితంగా 300 మంది ఒకోసారి మాట్లాడే వర్చువల్ మీటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. వెబినార్లు, సాధారణ చిట్‌చాట్, మీటింగ్‌లకు ఇది బాగా ఉపయోగపడనుంది. ఈ విషయాన్ని సంస్థ మేనేజర్ మైక్ థాల్ఫ్సన్ ప్రకటించారు. జూమ్, గూగుల్ మీట్లో ప్రస్తుతం 100 మంది వరకే ఏకకాలంలో కనెక్ట్ అయ్యే వెసులుబాటు ఉంది.
ప్రస్తుతం 250 లిమిట్‌తోనే ఈ యాప్ పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌కు ప్రభుత్వం అనుమతి ఇస్తే దాన్ని 300 పెంచుతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందో వివరాలు ప్రకటించలేదు. ఒక స్క్రీన్‌లో ఒకేసారి 49 మంది కనిపించేలాగా ఈ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మిగతావారు స్లైడ్ చేస్తే కనిపిస్తారు.