ఏపీలో మద్యం అమ్మకాలు ఢమాల్ !

NAGARJUNA NAKKA

ఏపీలో మద్యం అమ్మకాలు క్షీణిస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న విధంగా.... దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా చేపట్టిన అనేక చర్యలు లిక్కర్ సేల్స్‌పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం- ఈ ఏడాది జరిగిన మద్యం లెక్కలను పరిశీలిస్తే జగన్ సర్కార్ ఏ విధంగా మద్యం అమ్మకాలు తగ్గించిందో  అర్థమవుతుంది. ఒక్కసారిగా 75 శాతం పెంచిన ధరలతో మందుబాబులకు కరెంట్ షాక్ కొట్టింది. 

 

ఏపీలో ఏరులై పారుతున్న మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తానని మాటిచ్చారు జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నాటి నుంచి మద్యం అమ్మకాలపై అనేక ఆంక్షలను విధిస్తూ వచ్చారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు క్షేత్రస్థాయిలో అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత ఏడాది మే నుంచి ఇప్పటివరకు జరిగిన గణాంకాలను పరిశీలిస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. బీర్లను దాదాపుగా తగ్గించిన పరిస్థితి ఏపీలో కనపడుతోంది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయనే మాట అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. 

 

జగన్ సర్కారు మద్యంపై ఒకేసారి 75 శాతం ధరలు పెంచడంతో రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ పడిపోతున్నాయి.  గత ఏడాది మే నెలలో 28.52 లక్షల కేసుల మద్యం అమ్మగా... ఖజానాకి 141 కోట్ల ఆదాయం వచ్చింది. 34.47 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగ్గా... ఖజనాకు 41 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. 2020 మే నెల లెక్కలను పరిశీలిస్తే...మద్యం అమ్మకాలు 28 లక్షల నుంచి 11.68 లక్షల కేసులకు తగ్గింది. అయితే, 75 శాతం ఆదాయం పెంచటం వల్ల ఖజానాకు 133 కోట్ల ఆదాయం వచ్చింది. అమ్మకాల్లో భారీ వ్యత్యాసం వచ్చినప్పటికీ ..ధరల పెంపుతో ఆదాయంలో కేవలం 8 కోట్ల తేడా మాత్రమే వచ్చింది. 

 

రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులను తగ్గిస్తూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం రెండు సార్లు ఆదేశాలు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 4వేల380 వైన్ షాపులు ఉండగా 20 శాతం తగ్గింపుతో అవి 3వేల500కి చేరుకున్నాయి. వాటిలో కూడా మొత్తం 13 శాతం తగ్గించడంతో.... 2వేల986 మిగిలాయి. వీటిని కూడా మరింతగా తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరోవైపు బార్లను కూడా తగ్గించటానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ అంశం కోర్టులో ఉండడంతో నిలిచిపోయింది. ప్రస్తుతం బార్లకు సమయం ముగియటంతో వాటిని తిరిగి పునరుద్ధరణ చేయటంలో ఏ నిబంధనలు పాటిస్తారో ఎలా వాటిని తగ్గిస్తారో వేచి చూడాల్పి ఉంది. ప్రస్తుతం మద్యం షాపుల పని దినాలు  కుదించారు.   గతంలో కన్నా రోజుకు మూడు గంటలు  పని దినాలు తగ్గడం కూడా  లిక్కర్ అమ్మకాలపై  దెబ్బ పడింది.  సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తుందని అంటున్నారు  ప్రొహిబిషన్ అండ్  ఎక్సైజ్ శాఖ  అధికారులు. 

 

తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో కొందరు సరిహద్దులు దాటి గుట్టుగా వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణతో పాటు యానం నుండి  మద్యం అక్రమంగా  తరలి రాకుండా  అధికారులు  నిఘా పెంచారు.  

 

 

~

 

 

 


 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: