ఎల్జీ పాలిమర్స్ పై ఎన్జీటీ కీలక ఆదేశాలు.. !

NAGARJUNA NAKKA

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని స్పష్టం చేసింది.  పర్యావరణ పునరుద్ధరణకు ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.

 

కమిటీ పర్యవేక్షణ బాధ్యతలు కేంద్ర పర్యావరణ శాఖకు అప్పగించింది. దుర్ఘటనతో కలిగిన ఆర్థిక నష్టం, ఇవ్వాల్సిన పరిహారాన్ని అంచనా వేసేందుకు మరో కమిటీని నియమించాలని ఎన్జీటీ ఆదేశించింది. 

 

విశాఖలో విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది . ప్రాథమిక నష్టపరిహారం కింద జమచేసిన 50 కోట్ల రూపాయలను  బాధితులకు పంచాలని ఆదేశించింది.

 

అదేవిధంగా పర్యావరణ పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.  కేంద్ర పర్యావరణ శాఖ, పీసీబీ నుంచి ఒక్కొక్కరు, విశాఖ కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేయాలని.. రెండు నెలల్లోగా కమిటీ పునరుద్ధరణ ప్రణాళిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కమిటీకి కేంద్ర పర్యావరణ శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించాలని సూచించింది.

 

బాధితులకు పరిహారం నిర్ణయించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. రెండు వారాల్లో కమిటీని ఏర్పాటు చేసి.. రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.

ఇక కంపెనీకి అనుమతుల విషయంలో చట్ట ప్రకారంగా నడుచుకోని బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఎన్‌జీటీ ఆదేశించింది. అదే విధంగా చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఎల్జీ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది.

 

కంపెనీకి అనుమతులు ఇస్తే వాటి వివరాలు ట్రిబ్యునల్‌కు తెలియజేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మొత్తానికి ఎన్జీటీ.. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై తగు చర్యలు తీసుకుంటోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: