క్రీడాభిమానులకు గుడ్ న్యూస్.. !

NAGARJUNA NAKKA

కరోనాతో క్రీడలన్నీ అటకెక్కాయ్‌. ఈ టైంలో సూపర్‌ స్టార్లతో కూడిన భారత్‌- ఆస్ట్రేలియా మధ్య పూర్తిస్థాయి క్రికెట్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల కావడం సగటు అభిమానికి సంతోషం కలిగించింది. టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్‌పై ఇంకా స్పష్టత రాకపోయినా.. ఈ ఏడాది చివర్లో స్మిత్‌, కోహ్లీ బ్యాటింగ్‌ విన్యాసాలు చూస్తామన్న జోష్‌లో ఉన్నారు ఫ్యాన్స్‌. కానీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో కనీసం ఒక వార్మప్‌ మ్యాచ్‌ లేకపోవడంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

వరల్డ్‌కప్‌ నిర్వహణ కన్నా భారత్‌ టూర్‌పైనే ఆశలు పెట్టుకుంది క్రికెట్‌ ఆస్ట్రేలియా. ఎందుకంటే ఈ టూర్ జ‌రిగితే త‌మ బోర్డుకు నిధులు భారీగా వస్తాయని నమ్మకం పెట్టుకుంది. క‌రోనా కార‌ణంగా ఇప్పటికే క్రికెట్‌ ఆస్ట్రేలియా అప్పుల్లో కూరుకుపోయింది. సిరీస్ నిర్వహ‌ణ కోసం ఇప్పటికే 50 మిలియ‌న్ డాల‌ర్లను అప్పు చేసింది. ఈ సిరీస్ జ‌రిగితే 300 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. అందుకే మూడు ఫార్మాట్లలో సిరీస్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

 

కోహ్లీసేన టీ20 సిరీస్‌ ఆడాక.. ఒకవేళ పొట్టి ప్రపంచకప్‌ జరిగితే నవంబరు 15 తర్వాత భారత్‌కు వస్తుంది. ఆ తర్వాత డిసెంబరు 3 నుంచి బ్రిస్బేన్‌లో జరిగే నాలుగు టెస్టుల కోసం తిరిగి కంగారూ గడ్డపై అడుగుపెట్టాలి. టెస్ట్‌ సిరీస్‌లో డిసెంబర్‌ 11 నుంచి 15 వరకు అడిలైడ్‌లో భారత జట్టు డే అండ్‌ నైట్‌ టెస్టును కూడా ఆడాలి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఎంతో ప్రతిష్టాత్మకమైనా ఈ  సిరీస్‌ కోసం కనీసం ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను కూడా సీఏ కేటాయించలేదు. ఎలాంటి వార్మప్‌ లేకుండా ఆసీస్‌ గడ్డపై ఎదురయ్యే కఠిన సవాల్‌ను ఎదుర్కోవడం టీమిండియాకు ఇబ్బందే. 

 

ఇక పింక్‌ టెస్ట్‌ విషయానికి వస్తే ఈ సమస్య మరింత ఎక్కువ కానుంది. గతంలో డే అంట్‌ నైట్‌ మ్యాచ్‌కు సిద్ధమయ్యేందుకు కచ్చితంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఉండాలని కోహ్లీ స్పష్టం చేశాడు. కానీ, ఈ లాంగ్‌ షెడ్యూల్‌లో కనీసం ఒక వార్మప్ మ్యాచ్‌ కూడా లేదు. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇంత వరకు స్పందించలేదు. జట్టు శ్రేయస్సే ముఖ్యమని భావించే కోహ్లీ కూడా ఈ విషయంలో మౌనంగా ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌ మౌనంపై మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: