హమ్మయ్యా.. కోలుకుంటున్నారు.. !

NAGARJUNA NAKKA

కరోనా మహమ్మారి మానవజాతికే పెనుముప్పులా మారింది. చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరిపైనా ఈ వైరస్‌ దాడి చేస్తోంది. ఇప్పటికే లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. అన్ని వయస్కుల వాళ్లు వైరస్ నుంచి కోలుకోవడం కొంచెం ఊరట ఇచ్చే అంశం.

 

దేశంలో కరోనా విజృంభిస్తోంది. వేల మంది వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. బాధితుల్లో చిన్నారులు, వృద్ధులు కూడా వందల సంఖ్యలో  ఉన్నారు. వయస్సులో ఉన్న వాళ్లు, యువకులు ఎలాగోలా తట్టుకుని నిలబడగలరు. కానీ వృద్ధులు, పిల్లలు వైరస్ బారిన పడితే ఏంటా? అని ఆందోళన నెలకొంది. కానీ వారు కూడా వైరస్‌ నుంచి వేగంగానే కోలుకుంటున్నారు. వయస్సు మళ్ళిన వారు, ఇతర రోగాల సమస్యలతో బాధపడేవారు, చిన్నారులు వైరస్‌ను జయించి ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నారు.

 

కర్నూలు జిల్లాలో కరోనా బారిన పడిన వారిలో ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. జిల్లాలోని గనిగల్లీకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించాడు. విశ్వభారతి కోవిడ్‌ ఆసుపత్రిలో గత నెల 14 న వృద్ధుడు కరోనా పాజిటివ్‌తో చేరాడు. ఈ వ్యక్తికి బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నాయ్‌. అయినా సరే, కరోనాతో పోరాడాడు. చివరికి ఆయన ఆరోగ్యం మెరుగుపడి డిశ్చార్జ్‌ అయ్యారు.

 

ఇదే జిల్లాలో 14 నెలల చిన్నారి కూడా మహమ్మారి బారిన పడింది. చిన్నారి కూడా కరోనా వైరస్‌ మెడలు వంచింది. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ పాపకు నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్‌ చేశారు అధికారులు. ఇక నంద్యాలలోని శాంతిరాం కోవిడ్ ఆసుపత్రి నుంచి 8 సంవత్సరాల చిన్నారి కూడా వైరస్‌ను జయించింది. ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. 

 

హైదరాబాద్‌లోనూ 75 ఏళ్ల వృద్ధుడు వైరస్‌ నుంచి కోలుకున్నాడు. డయాలసిస్ రోగంతో బాధపడుతున్నప్పటికీ వైరస్ ముప్పు నుంచి తప్పించుకున్నాడు. గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతంగా పనిచేస్తున్నట్టు మంత్రి ఈటల కితాబిచ్చారు. 

 

మరోవైపు ఆరేళ్ల బాలుడు వైరస్‌ నుంచి కోలుకుని గత సోమవారం గాంధీ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి వచ్చిన ఒకరి ద్వారా జైనూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకింది. అతని నుంచి ఆరేళ్ల మనుమడికి అంటుకుంది. గత నెల 18న పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో గాంధీ దవాఖానకు తరలించారు. తాజాగా బాలుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. గతంలోనూ 80 పైబడిన వృద్ధులు.. చిన్నారులు వైరస్ ఎదిరించి నిలబడ్డారు. మొత్తంగా ఈ వయస్కుల్లోనూ వైరస్ నుంచికోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: