కరోనా ఎఫెక్ట్ : దయనీయ పరిస్థితిలో వలస కూలీలు !
లాక్ డౌన్ ప్రభావం వలస కూలీలపై తీవ్రంగా కనిపిస్తోంది. పొట్ట చేత పట్టుకుని రాష్ట్రాలు దాటి వెళ్లిన వలస కార్మికులు....వందల కిలోమీటర్లు నడుస్తూ సొంత ఊళ్లకు పయనం అవుతున్నారు. లాక్ డౌన్ పొడగింపుతో కాలిబాటనే ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వెయ్యి కిలోమీటర్ల దూరం సైతం నడిచేందుకు రోడ్డెక్కిన వారి కష్టం ఆవేదన కలిగిస్తోంది. ఎలాగైనా ఇంటికి చేరాలన్న వారి పట్టుదల ప్రశంసలు కురిపిస్తోంది.
దేశంలో అన్ని చోట్లా ఉన్నట్లే ఏపీకి చెందిన వల కూలీలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలలో పనుల కోసం వెళ్లిన వారు...లాక్ డౌన్ పొడిగింపుతో రోడ్డున పడ్డారు. పనికి వెళ్లిన చోట వసతి లేకపోవడం, తిండికి, నీడకు ఇబ్బంది రావడంతో చాలా మంది మొండి ధైర్యంతో నడకను ఎంచుకున్నారు. వందల కిలోమీటర్ల దూరం అని తెలిసినా...నెత్తిన మూట పెట్టుకుని కుటుంబాలతో కలిసి సాగుతున్నారు. ముఖ్యంగా చెన్నై నుంచి పెద్ద సంఖ్యంల ఉత్తరాంద్రకు చెందిన కూలీలు వస్తున్నారు. దాదాపు 900 నుంచి వెయ్యి కిలోమీరట్ల దూరం ఉండే తమ ఇళ్లకు హైవేలలో కాలినడకన బయలు దేరారు. రెండో దఫా లాక్ డౌన్ పై ప్రకటన వచ్చిన తరువాత ఇక అవకాశం లేదు అనుకున్న వలస కూలీలు ఇతర ప్రాంతాల నుంచి ఏపీలోని తమ తమ ఊళ్లకు బయలు దేరారు.
అంతేకాదు చెన్నై నుంచి కోల్ కతా హైవేలో చాలా చోట్ల ఇలా నెత్తిన సంచితో వలస కార్మికులు కాలి బాటన వెళ్లడం కనిపిస్తోంది. కొన్ని చోట్ల పోలీసులే ఆహారం అందించి సహాయం చేస్తుండగా...కొన్నొ చోట్ల వారిని నిబంధనలు అనుమతించడం లేదని నిలిపివేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడం, వందల కిలోమీటర్ల దూరం కావడం తో నడిచి వెళ్లడం శ్రేయస్కరం కాదని పోలీసులు చెపుతున్నారు. అలా అని వీరిని ఏదో ఒక వాహనం ఎక్కి పంపిచే ధైర్యం కూడా పోలీసులు చేయడం లేదు. మానవీయం కోణంలో వారికి సహాయం చేయాలని చూసినా....గూడ్స్ వాహనాల్లో ప్రజల రవాణాపై గట్టి ఆంక్షలు ఉండడంతో పోలీసులు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల నడుస్తూ వెళుతున్న వారిని పోలీసులు ఆహారం నీరు ఇచ్చి పంపుతుండగా...కొన్ని చోట్ల నడిచి వెళ్లవద్దు అంటూ వారిస్తున్నారు. దీంతో వారు భయం భయంగా నడుస్తూ ఇళ్లకు చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వందల కిలోమీర్లు నడిచిన తమను ఆపవద్దని వేడుకుంటున్నారు.
లాక్ డౌన్ అంటూ ప్రకటిస్తున్న ప్రభుత్వాలు...వసల కూలీల కష్టంపై తగిన వ్యూహం లేకుండా ప్రకటనలు ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడి వారిని అక్కడే ఉంచాలనే సూత్రం మంచిదే అయినా.....తిండి, నీడ లేని వారి విషయంలో కాస్త ఆలోచన చెయ్యాల్సింది అనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వాల ఆనాలోచిత, ఆకస్మిక నిర్ణయాలతో బడుగు జీవులు ఇలా రోడ్డున పడ్డారు.