ప్రాణాలకు తెగించి సేవచేస్తున్నాం.. పట్టించుకోండి ప్లీజ్..!

NAGARJUNA NAKKA

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి, ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల వద్దకు వెళ్తే ఛీత్కరింపులు, అవహేళనలు ఎదురయ్యాయి. ఒకరు కాకపోతే మరొకరైనా తమ కష్టాలను గట్టెక్కిస్తారేమో అని ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. దీంతో చేసేదేమీ లేక నమ్ముకున్న ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధమైయ్యారు ఆ ఉద్యోగాలు. 

 

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుగా నిలిచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ఓపిక నశించింది. గాంధీ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, ముఖ్యంగా నర్సుల నుంచి తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తమవుతోంది. ఎప్పట్నుంచో ఉన్నతాధికారులకు తమ సమస్యలు పరిష్కరించాలని మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో వారంతా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సరైన వసతులు, కనీసవేతనాలు ఇస్తే చాలు కరోనా రోగులకు రాత్రంబవళ్లు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. అధికారుల నుంచి స్పందన రావడం లేదని గాంధీ అవుట్ సోర్సింగ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

రోజు రోజుకు రోగులు, అనుమానితుల సంఖ్య పెరుగుతున్నట్టుగానే బెడ్లు, నర్సుల సంఖ్య పెంచాల్సి వస్తోంది. కానీ వారికి సకాలంలో సదుపాయాలను కల్పించడంలో సర్కారు వెనుకబడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గాంధీతో పాటు మిగతా ఆస్పత్రుల్లో ఉన్న నర్సులు.. తమ సమస్యలను పై అధికారులకు విన్నవించుకున్నారు. ఒకవైపు దేశమంతా నర్సుల సేవలకు జేజేలు పలుకుతుంటే గాంధీ ఆస్పత్రిలోని అవుట్‌ సోర్సింగ్‌ నర్సులకు ఇప్పటి వరకు గత నెల జీతం కూడా చెల్లించలేదు. దీంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

గాంధీ ఆస్పత్రిలో 110 మంది రెగ్యులర్‌ నర్సులు ఉండగా.. 220 మంది అవుట్‌ సోర్సింగ్‌ నర్సులు పని చేస్తున్నారు. అయితే కరోనా కోసం ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయడంతో ఇతర విభాగాల్లో పని చేసే వారికి సైతం గాంధీ ఆస్పత్రిలో విధులు అప్పగించారు. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులకు వస్తుంటే.. కనీస రవాణా సదుపాయం కూడా కల్పంచడం లేదని  నర్సులు ఆవేదన చెందుతున్నారు. వ్యక్తిగత రక్షణ కిట్లు సకాలంలో అందడం లేదని చెప్తున్నారు నర్సులు. తమకు.. కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం చేయించడం లేదని వాపోతున్నారు. 

 

మరోవైపు కరోనా వార్డుల్లో విధులు నిర్వర్తించేందుకు తాత్కాలిక పద్దతిలో నర్సులను తీసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వారికి మాత్రం నెలకు 25 వేల జీతం చెల్లిస్తామని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. దీనిపై అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు కేవలం 14 వేల 880 రూపాయలు మాత్రమే ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు అడగడం లేదనీ.. కనీస వేతనం, సదుపాయలు కల్పించాలని వేడుకుంటున్నట్టు తెలిపారు.

 

చాలి చాలని జీతాలతో కుటుంబాలను ఎలా పోషించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని అవుట్ సోర్సింగ్ నర్సులు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న విపత్తు సమయంలో విధులు నిర్వహిస్తున్న తమకు ఇంటా బయట అన్ని ఇబ్బందులే ఎదురవుతున్నాయని వాపోతున్నారు. సీఎం కేసీఆర్ స్పందించి తమకు జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ నర్సులు డిమాండ్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: