లాక్ డౌన్ పొడిగింపు... జగన్ చెప్పిందే చేస్తున్న మోదీ...?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరు ఏప్రిల్ 30 వరకు కేంద్రం లాక్ డౌన్ ను పొడిగిస్తుందని చెబుతుంటే... మరికొందరు మాత్రం మే 15 వరకు పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే జగన్ ప్రతిపాదనకు అనుగుణంగానే మోదీ లాక్ డౌన్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. కరోనా కేసులు తక్కువ లేదా అసలు లేని ప్రాంతాలలో లాక్ డౌన్ ను ఎత్తివేయాలనే జగన్ ప్రతిపాదనను మోదీ స్వాగతించినట్టు తెలుస్తోంది.కరోనా తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం జగన్ కొన్ని రోజుల క్రితం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని ముందు పలు ప్రతిపాదనలు పెట్టారు.
తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలలో సడలింపులతో లాక్ డౌన్ అమలు చేయాలని సూచించారు. కేసులు నమోదు కాని ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రతిపాదనలు చేశారు. ప్రధాని మోదీ జగన్ ప్రతిపాదనలను అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, రాష్ట్రాలకు కూడా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రం కరోనా ఉధృతిని బట్టి దేశవ్యాప్తంగా జిల్లాలను జోన్లుగా గుర్తించనుంది.
కేంద్రం జోన్ల వారీగా మార్గదర్శకాలను ఇవ్వనుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 400 జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలోకి రానున్నాయని తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ గురించి, మార్గదర్శకాల గురించి కీలక ప్రకటన చేయనున్నారు. కేంద్రం కరోనా ప్రభావిత ప్రాంతాల్లో, కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో ఏ విధమైన చర్యలు చేపట్టనుందో తెలియాలంటే మాత్రం రేపటివరకు ఆగాల్సిందే.