మానవాళికే సవాల్ విసురుతున్న కరోనా... టెస్టుల్లో చిక్కని వైరస్...?
దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నాయి. అమెరికాలో కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. అయితే ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణాల గురించి ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో కరోనా సోకినప్పటికీ ఫలితం నెగిటివ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తేలింది. ఇలాంటి పరిణామాల వల్ల కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిర్ధారించేందుకు పాలీ మెరేస్ ఛైన్ రియాక్షన్ పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఈ విధానంలో వ్యక్తి ముక్కు, గొంతు నుంచి నమూనాలను సేకరించి వైద్యులు పరీక్షలు జరుపుతున్నారు.
అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణురాలు ప్రియా సంపత్ ప్రస్తుతం వైద్యులు అనుసరిస్తున్న పరీక్షలు ప్రాథమిక పరీక్షలుగానే భావించాలని చెప్పారు. కరోనా సోకిన వ్యక్తుల్లో 60 నుంచి 70 శాతం మందికి మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయినట్లు చెబుతున్నారు. దీన్ని 90 శాతానికి పెంచితే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిర్ధారణ పరీక్ష కచ్చితంగా లేకపోతే ఒక్క శాతం తప్పుగా సూచించే కేసులు కూడా కొన్ని వేల కేసులు నమోదు చేస్తాయని చెప్పారు.
నమూనాలను సేకరించడంతో పాటు రోగి లక్షణాలు తెలుసుకోవాలని... మరిన్ని పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జాన్ హాప్ కిన్స్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు నిర్ధారణ పరీక్షలలో లోపం వల్ల కరోన సోకిన వ్యక్తికి నెగిటివ్ వస్తే అతని వల్ల మరికొంతమందికి కరోనా సోకుతుందని అన్నారు. నిపుణులు కరోనా నిర్ధారణ కోసం సెరొలాజికల్ పద్ధతి ఉపయోగిస్తే మంచిదని.... ఈ పద్ధతి ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.