రైతులకు జగన్ సర్కార్ శుభవార్త....!

Reddy P Rajasekhar

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న విషయం తెలిసిందే. రైతులకు గ్రామాల్లోనే వ్యవసాయ సంబంధ సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 12,000 రైతు భరోసా కేంద్రాలను ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసింది. 
 
రైతులకు ఖరీఫ్ నుంచి రైతు భరోసా కేంద్రాలు సేవలు అందించనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 3,000 రైతు భరోసా కేంద్రాలు సిద్ధం కాగా 9,000 కేంద్రాల్లో పెయింటింగ్, బ్రాండింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. లాక్ డౌన్ వల్ల ఫర్నిచర్, ఇతర సామాగ్రి రైతు భరోసా కేంద్రాలకు ఇంకా చేరలేదు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ కమిషనర్, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు విత్తనాల నాణ్యత, ఎరువులు, భూసార పరీక్షల కిట్ల కొనుగోలు బాధ్యతలను అప్పగించింది. 
 
రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత, రైతులు అధిక ఆదాయం పొందేలా కృషి చేయనుంది. ఈ కేంద్రాలలో భూసార పరీక్షలు జరగడంతో పాటు ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా అవుతాయి. ఈ కేంద్రాలు భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా భూమిలో ఏయే పంటలు బాగా పండుతాయో రైతులకు సూచిస్తాయి. 
 
ఈ కేంద్రాలలో ఉండే వ్యవసాయ నిపుణులు ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు సూచనలు చేస్తారు. రైతు భరోసా కేంద్రాలకు అనుగుణంగా అగ్రి షాప్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ దుకాణాల ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు లభిస్తాయి. తెగుళ్ల నివారణోపాయాలు, పంటల సాగు పద్ధతుల గురించి ఈ కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాలు, అగ్రి షాప్స్ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: