ఏపీ ప్రజలకు ప్రభుత్వం షాక్... అమలులోకి కఠిన నిబంధనలు...?
దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న రాత్రి ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించారు. ఏపీలో పోలీసులు లాక్ డౌన్ అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. రాష్ట్రంలో ఉగాది పండగ సందడి ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వం పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
విజయవాడలో పోలీసులు విసృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఉదయం 9 గంటల వరకు మాత్రమే ప్రజలకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చింది. పోలీసులు అనవసరంగా రోడ్లపైకి ప్రజలు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రజలoతా ఇళ్లకే పరిమితమయ్యారు. రాజకీయ పార్టీలు పార్టీ కార్యాలయాలలో పంచాంగ శ్రవాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశాయి.
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కరోనాను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, ఇతర విషయాల గురించి చర్చించడానికి అధికారులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నా ప్రభుత్వం కేసుల సంఖ్య పెరగకుండా ముందుజాగ్రత్తచర్యలు చేపడుతోంది. అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే పోలీసులు రోడ్లపైకి అనుమతిస్తున్నారు.
రాష్ట్రంలో ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు మరోసారి సర్వే చేయనున్నారు. 48 గంటల్లో సర్వే చేయాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా భారీన పడి 18,907 మంది మృతి చెందారు, ప్రపంచదేశాలను కరోనా గజగజా వణిస్తూ ఉండటంతో ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడానికి ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటూ వైరస్ నివారణ దిశగా చర్యలు చేపడుతున్నాయి.