హెరాల్డ్ విజేత: 500 రూపాయల పెట్టుబడితో లక్షల కోట్లు సంపాదించిన ధీరూబాయ్ అంబానీ సక్సెస్ స్టోరీ
ధీరూబాయ్ అంబానీ అసలు పేరు ధీరాజ్లాల్ హిరచంద్ అంబానీ. ఈయన 1932 డిసెంబర్ 8న గుజరాత్ రాష్ట్రంలో నిరాడంబరమైన మోడ్ కుటుంబంలో జన్మించారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండటంతో ధీరూబాయ్ పదో తరగతితోనే చదువును ఆపేశారు. ఆయన 16 సంవత్సరాల వయస్సులో యెమెన్ దేశములోని ఎడెన్ కు పని కోసం వెళ్లారు. అక్కడ నెలకు 300 రూపాయల జీతంతో పెట్రోల్ బంక్ లో అటెండెంట్ గా జాయిన్ అయ్యారు.
అక్కడ బంకులో పనిచేసే సమయంలో ధీరూబాయ్ కు ఒక తెలివైన ఆలోచన వచ్చింది. యెమెన్ దేశంలో ఉన్న రియాల్ కరెన్సీని అప్పట్లో సిల్వర్ కాయిన్స్ తో తయారు చేసేవారు. ఆ సిల్వర్ కాయిన్స్ ను కరిగించి అమ్ముకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చేవి. ఈ విషయం తెలిసిన ధీరూబాయ్ తన దగ్గర ఉన్న నోట్లతో ఎన్ని కాయిన్స్ కొనగలితే అన్ని కొని వాటిని సిల్వర్ గా మార్చి మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకునేవారు. అక్కడే వివాహం చేసుకున్న ఆయన 1962లో భారతదేశం తిరిగివచ్చి 500 రూపాయల పెట్టుబడితో రిలయన్స్ మొదలుపెట్టారు.
ఎనిమిది సంవత్సరాల పాటు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టిన ధీరూబాయ్ రానున్న కాలంలో భారత్ లో టెక్స్ టైల్ బిజినెస్ కు భవిష్యత్ ఉంటుందని గ్రహించి 1977లో అహ్మదాబాద్ లోని నరోడాలో స్పిన్నింగ్ మిల్లును ప్రారంభించారు. మార్కెట్ వర్గాలు విమల్ బ్రాండ్ ను కొనడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఆయన విమల్ పేరుతో వస్త్ర దుకాణాలను ప్రారంభించారు. ఆ కాలంలో ఒక బ్రాండ్ కు సంబంధించిన దుకాణాలను ఏర్పాటు చేయడం చాలా అరుదు.
1977లో ధీరూబాయ్ స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టారు. చిన్న చిన్న ఇన్వెస్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి తన భవిష్యత్తు ప్రణాళికలు చెప్పి ఇన్వెస్టర్లు తన కంపెనీలో పెట్టుబడులు పెట్టేలా చేశారు. నేడు రిలయన్స్ కంపెనీకి నాలుగు లక్షలకు పైగా ఇన్వెస్టర్లు ఉన్నారు. 1991లో ఆయన హజారియా గ్యాస్ క్రాకర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. టెలీ కమ్యూనికేషన్స్, ఐటీ, ఎనర్జీ, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.
ఏ వస్తువునైనా క్వాలిటీతో అతి తక్కువ ధరకు ప్రజలకు చేరేలా చేయడం ఆయన సక్సెస్ సీక్రెట్. ఆ వస్తువును ఎక్కువ సంఖ్యలో అమ్మి ఆయన లాభాలు సాధించేవారు. 1996లో రిలయన్స్ విద్యుత్ మరియు టెలికాం రంగాల్లో 1000 కోట్ల రూపాయలు లాభాలు అందుకున్న తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. 500 రూపాయల పెట్టుబడితో 2002 నాటికి 75 వేల కోట్ల కంపెనీని సృష్టించడం ధీరూబాయ్ కు మాత్రమే సాధ్యమైంది. 2002 జులై 6న గుండెపోటు రావడంతో ధీరూబాయ్ అంబానీ మృతి చెందారు. నేడు ఆయన స్థాపించిన రిలయన్స్ కంపెనీ లక్షల కోట్ల రూపాయల కంపెనీగా మారింది.