యువతులే వారి టార్గెట్... పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఏం చేస్తారంటే...?
ఈ మధ్య కాలంలో మ్యాట్రిమొనీ సైట్లలో యువతులను మోసం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వెబ్ సైట్లలో దరఖాస్తు చేసిన యువతులను టార్గెట్ చేసి సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. యువతులతో మొదట పరిచయం పెంచుకొని తాము ధనవంతులమని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామని మాయమాటలు చెబుతారు. బహుమతుల రూపంలో ఆభరణాలను, డైమండ్లను, డాలర్లను పంపిస్తామని నమ్మిస్తారు.
ఆ తర్వాత తాము కస్టమ్స్ అధికారులమని నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తే బహుమతులు ఇంటికి చేరతాయని లేకపోతే వాటిని వెనక్కు పంపిస్తామని చెబుతారు. తాజాగా సైబర్ మోసగాళ్లు ఒక డాక్టర్ ను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నైజీరియన్, నేపాలీ ముఠా 12.5 లక్షల రూపాయలు వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి కాజేసింది. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా మిగతా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ క్రైం పోలీసులు ఆన్ లైన్ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలు చేస్తున్న విదేశీ ముఠాను అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యుల ముఠా పెళ్లి చేసుకుంటామంటూ, బహుమతులు పంపించామంటూ మోసాలకు పాల్పడ్డారు. నగదు జమ చేసిన తర్వాత వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ ఈ విషయాలను వెల్లడించారు. సైబరాబాద్ లో నివాసం ఉండే ఒక మహిళ డైవర్సీ మ్యాట్రిమొనీలో రిజిష్టర్ చేసుకుంది. ఆమెకు సైట్ లో విపుల్ ప్రకాష్ అనే నైజీరియన్ తో పరిచయం ఏర్పడింది. అతను ఆమెకు బహుమతులు పంపిస్తున్నానని చెప్పాడు. అలా చెప్పిన మరుసటి రోజే ఆమెకు పార్శిల్ కు సంబంధిన ట్యాక్స్ లు కట్టాలని కాల్ రావడంతో ఆమె 7.45 లక్షలు డిపాజిట్ చేసింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి మహిళ సైబరాబాద్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.