ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ మద్యం !
ఏపీలో మద్య నియంత్రణపై తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం తూర్పుగోదావరి జిల్లాలో అటకెక్కింది. ఇటు విలీన మండలాల్లోనూ, అటు కోనసీమలోనూ అక్రమ మద్యం ఏరులై పారుతోంది. గతంలో కంటే ఎక్కువగా బెల్ట్ షాపులు వెలిశాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న షాపులతో కుమ్మక్కయి.. తెలంగాణ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అమ్మడం పరిపాటిగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపాన నియంత్రణపై తీసుకున్న నిర్ణయం కొంతమంది కేటుగాళ్లకు వరంగా మారింది. ఆంధ్ర విలీన మండలాలకు ఇటు తెలంగాణ, ఛత్తీస్ గడ్ లు పాండిచ్చేరిలోని యానాం కోనసీమ ప్రాంతానికి పక్కనే ఉండటం బాగా కలిసొచ్చింది. ఎక్సైజ్ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాల నుంచి వాహనాల్లో అక్రమ మద్యాన్ని బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు.
తూర్పుగోదావరిజిల్లావ్యాప్తంగా 432 మద్యం దుకాణాలకు అనుమతి ఉండగా, 426 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల్లోగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా దుకాణాల్లోని సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా ఆర్థిక ప్రయోజనా లకు లొంగిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. షాపునకు సరఫరా అవుతున్న మద్యాన్ని సమీపంలోని బెల్ట్‌షాపులకు తరలించి అదనపు ధరలకు అమ్ముకుంటున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా అన్నిప్రాంతాల్లోను అనధికారికంగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నప్పటికీ పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. షాపుల్లో పనిచేసే కొందరు సిబ్బందికి సైతం ఎక్సైజ్‌శాఖ అధికారులు తలొంచి పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడడం వెనుక రాజకీయ ఒత్తిడులు తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలు అసలే గిరిజన ప్రాంతాలు, ఆపై పట్టించుకునే నాథుడే లేడు. తెలంగాణా ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుండి సరుకు తెచ్చి నిర్భయంగా అమ్మేస్తూ.. లక్షలు సంపాదిస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా మద్యం గ్రామాల్లో ఏరులై పారుతుండటంతో గ్రామాల్లో మహిళలు లబోదిబోమంటున్నారు.
మద్యం అక్రమాలకు పాల్పడకుండా నిరోధించడంతో పాటు మద్యం సేల్స్ వివరాలను కచ్చితంగా గుర్తించే క్రమంలో, ఎక్సైజ్‌శాఖ అధికారులు ర్యాండమ్‌గా తనిఖీలు చేస్తున్నారు. మద్యం బెల్ట్‌షాపులు ఎక్కడ నిర్వహిస్తున్నారో వాటి సమాచారాన్ని సేకరించి, కొందరిపై కేసులను సైతం నమోదు చేస్తున్నారు. జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టలేక ఎక్సైజ్ పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. పక్కా వ్యూహంతో అక్రమ మద్యం అమ్మకం దారుల గుట్టురట్టు చేసే పని చేపడుతుంటే, మరో వైపు రాజకీయ ఒత్తిడులతో కేసులు నీరుగారిపోతున్నాయి. మరి అక్రమ మద్యం జోరుకు ప్రభుత్వం ఏ విధంగా కళ్లెం వేస్తుందో వేచి చూడాలి.