చంద్రబాబు పై పోరాటం ఆపనంటున్న అత్తగారు ?
టిడిపి అధినేత చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉండటం దీనిపై స్టే తెచ్చుకోవడంతో చాలాకాలంగా ఈ కేసు పరిష్కారం కాకుండా ఉండిపోయింది. తాజాగా చంద్రబాబు కేసుకు సంబంధించి ఓ మీడియా ఛానెల్ ముందు నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. చంద్రబాబు అనేక అక్రమాలకు పాల్పడి ఆస్తులు సంపాదించారని, చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో మరిన్ని సోదాలు చేయాలని ఆమె కోరారు. చంద్రబాబు స్టేలు తెచ్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు తెచ్చుకున్న అన్ని స్టే లు రద్దయిపోయినా .. సుప్రీంకోర్టు ను కూడా చంద్రబాబు మనుషులు అపహాస్యం చేస్తున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
చంద్రబాబుకు న్యాయవ్యవస్థపై గౌరవం లేదు అంటూ లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు అక్రమ ఆస్తుల వ్యవహారంపై 2005లో తాను కోర్టులో పిటిషన్ వేశానని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. అయితే అప్పటి నుంచి దానిపై విచారణ జరగకుండా చంద్రబాబు స్టే లు తెచ్చుకుంటున్నారని లక్ష్మి పార్వతి విమర్శించారు. గతేడాది సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో స్పందిస్తూ ... సుదీర్ఘకాలం స్టేలు ఇవ్వరాదని తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు వేసిన పిటిషన్ లు ముగిసిపోయాయని, అయినా చంద్రబాబు దీనిపై బుకాయిస్తున్నాడన్నారు. ఇదే విషయమై ఏసీబీ కోర్టు తనకు నోటీసులు కూడా పంపించిందని లక్ష్మీపార్వతి వెల్లడించారు.
చంద్రబాబు విషయంలో తాను రాజీలేని పోరాటం చేస్తున్నా అని ఆమె అన్నారు. అయినా చంద్రబాబు మాత్రం స్టే ఇంకా రద్దు అవ్వలేదు అని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం కోర్టును కూడా అపహాస్యం చేసేలా చంద్రబాబు ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఈ కేసు ఫిబ్రవరి 14వ తేదీన విచారణ కు మరోసారి రాబోతుండడంతో ఏం నిర్ణయం కోర్టు వెలువరిస్తుంది అనేది ఉత్కంఠ నెలకొంది.