యువకుడి వింత ప్రేమ... పెద్దలు హెచ్చరించడంతో.. ఘోరం చెయ్యబోయాడు.. అంతలో..
భర్త చనిపోయి, ఇద్దరు పిల్లలతో బ్రతుకునీడుస్తున్న మహిళతో ప్రేమలో పడ్డాడో 20 ఏళ్ళ పడుచు పిలగాడు. తనకంటే ఎన్నో ఏళ్లు పెద్దదైన ఆమెతోనే జీవితం పంచుకోవాలనుకున్నాడు. కానీ అతడి ప్రేమకు పెద్దలు అడ్డుపడ్డారు. దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్న యువకుడు ఆదివారం రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ వింత ఘటన చిత్తూరు జిల్లా పాకాలలో పెను దుమారాన్నే రేపింది.
రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు చెందిన మహిళ(40) భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు(21) ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు కోరగా... వారు దానికి ససేమిరా కుదరదన్నారు. ఇద్దరు పిల్లలు గల తల్లితో పెళ్లి వద్దని ఆ పిలగాడికి వారించారు. కానీ, వారి మాటలను పట్టించుకోని సదరు యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఆదివారం సాయంత్రం పాకాలకు చేరుకొని తన మొబైల్ తెరిచాడు.
తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు.. ఫ్రెండ్‌కి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో అతడి ఫ్రెండ్ వెంటనే పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన పాకాల పోలీసులు వెంటనే రైలు పట్టాల వద్దకు చేరుకున్నారు. ముద్దలపల్లి వద్ద వెనక రైలు వస్తుండగా పట్టాల వెంట నడుస్తున్న యువకున్ని గుర్తించిన పోలీసులు గట్టిగా కేకలు వేసి హెచ్చరించారు... ఇక దీంతో యువకుడు పక్కకు తప్పుకొన్నాడు.
రైలు వెళ్లిపోగానే మరలా పట్టాలపై పడుకునేందుకు యత్నించాడు. అప్పటికే బైక్‌పై చేరుకున్న కానిస్టేబుళ్లు రవి, జ్యోతి అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం పాకాల ఎస్సై రాజశేఖర్ యువకున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. జరగబోయిన ఘోరాన్ని తప్పించినందుకు సదరు యువకుని తల్లి దండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు.