గండం గట్టెక్కిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ !

NAGARJUNA NAKKA

అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, గండం నుంచి గట్టెక్కారు. ఐదు నెలల నుంచి రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అభిశంసన ప్రక్రియకు పుల్ స్టాప్ పడింది. ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రంప్ కు మార్గం సుగమమైనట్లే. 

 

అధికారాన్ని దుర్వినియోగ పరిచారనే అభియోగాలతో అభిశంసనను ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గండాల నుంచి బయటపడ్డారు. తన పార్టీకి మెజార్టీ ఉన్న సెనేట్‌లో ట్రంప్‌ సునాయాసంగానే నెగ్గుకు రాగలరని అందరూ భావించారు. ఆయన పదవికి గండం లేదని ముందు నుంచీ ఊహిస్తూ వచ్చిందే. అయితే ఈ గెలుపు ఆయన నిర్దోషిత్వం వల్లనో, సచ్ఛీలత వల్లనో వచ్చింది కాదు. నవంబర్‌లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల ముంగిట ఆ దేశంలోని ప్రధాన పక్షాలైన రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీల పాలిట్రిక్స్ వల్ల ఆయాచితంగా లభించిందిగానే భావించాలి. 

 

నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున తనతో పోటీ పడనున్న జో బిడెన్‌ను దెబ్బతీయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నది ట్రంప్‌పై ప్రధాన అభియోగం. జో కుమారుడు హంటర్‌ బిడెన్‌కు ఉక్రెయిన్‌లో వ్యాపారాలున్నాయి. హంటర్‌ను కేసుల్లో ఇరికించాలంటూ ట్రంప్‌ ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఆ  దేశానికి సైనిక సాయంగా ప్రకటించిన నిధులు విడుదల చేయాలంటే తాను చెప్పిన పని చేయాల్సిందేనంటూ ట్రంప్‌ మెలిక పెట్టాడు. ఈ మేరకు ఆయనతో పలు మార్లు జరిపిన టెలిఫోన్‌ సంభాషణలను అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారి  ఒకరు బయటపెట్టడంతో వివాదం చెలరేగింది.   

 

అవన్నీ అబద్దాలని.. ఆధారం లేని ఆరోపణలంటూ ట్రంప్‌తో పాటు, ఆయన మద్దతు దారులు సమర్ధించుకుంటూ వచ్చారు. సాక్ష్యాలంటూ కొన్ని సృష్టించారు. ప్రతిపక్షం, ట్రంప్‌ వ్యతిరేకులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇది క్విడ్‌ ప్రోకో, అధికార దుర్వినియోగమే అంటూ విరుచుకుపడ్డారు. 

 

వివాదం రగుతులుండగానే.. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ,  2019 సెప్టెంబర్‌లో అభిశంసన ప్రక్రియను చట్టసభలో మొదలు పెట్టారు. విచారణలు, దర్యాప్తులు పూర్తి అయ్యాక.. డిసెంబర్‌లో ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలతో తెచ్చిన అభిశంసనపై,  ప్రతినిధుల సభలో ఓటింగు జరిగింది. ట్రంప్‌ అభిశంసనకు గురయ్యారు. అక్కడ నుంచి ఈ తీర్మానం ఎగువ సభ అయిన సెనేట్‌కు చేరింది. చర్చోపచర్చలు సాగిన అనంతరం ఫిబ్రవరి 5న ఓటింగు జరిగింది. 

 

సెనేట్‌లో అభిశంసన తీర్మానం వీగిపోయిందంటే, ట్రంప్‌ సచ్ఛీలుడని అర్థం కాదు. ఆయన గతం కానీ, అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న తీరే ట్రంప్ అహంభావాన్ని తెలియజేస్తాయి.ఆయన నైతికత మొదట్నుంచీ ప్రశ్నార్థకమే. సామాజిక, ప్రజాస్వామిక విలువలను ట్రంప్ పెద్దగా ఖాతరు చేసినట్లుగా కనిపించరు. అందుకే.. అభిశంసన ప్రక్రియ కొనసాగిన ఈ ఐదు నెలల కాలంలో.. అమెరికా సమాజంలో దాదాపు సగం మంది ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.

 

ఆరోపణల్లో నిజానిజాలను పక్కనపెట్టి ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేయాలనే కోరారు. సర్వేల్లోనూ అత్యధికులు మనోభావం ఇదే. కాంగ్రెస్‌ సభ్యుల్లో, సొంత పార్టీలోనూ ఇదే అభిప్రాయం ఉన్నట్టు సమాచారం. కాకపోతే.. అభిశంసన ను అడ్డం పెట్టుకొని,  రెండు ప్రధాన పార్టీల ప్రతినిధులూ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాలు పన్నారు. ట్రంప్‌పై తమకు వ్యతిరేకత ఉన్నా కూడా, ఒక్క మిట్‌ రోమ్నీ తప్ప రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు ఎవరూ ఓటింగు సమయంలో దాన్ని బయట పడనీయకుండా జాగ్రత్త పడ్డారు. తమ శక్తినంతా ఒడ్డి అభిశంసనను ఓడించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా సాక్షులను కూడా సెనేట్‌కు అనుమతించ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: