చెక్ పోస్ట్ ల వద్ద ఇసుక తరలింపు గొడవ !

NAGARJUNA NAKKA

తెలంగాణకు చెందిన ఇసుకను ఆంధ్రా మీదుగా తరలించాల్సిరావడంతో.. చెక్ పోస్టుల వద్ద అడ్డుకుంటున్నారు అధికారులు. మా ఇసుక మమ్మల్నే తరలించుకోనివ్వట్లేదు... ఇదేక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు.  

 

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పలు గ్రామాలకు ఇప్పుడు ఇసుక సమస్య వస్తోంది. ఇసుక తెలంగాణకు చెందినదే అయినా.. ఆంధ్రప్రదేశ్‌ రోడ్లపై రావాల్సిరావడంతో ట్యాక్స్ కట్టాల్సిందేనంటున్నారు ఏపీ చెక్‌పోస్ట్ అధికారులు. దీంతో తెలంగాణ అభివృద్ధి పథకాలకు ఇసుక సమస్య.. అడ్డంకిగా మారింది. 

 

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో.. అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు జరిగాయి. డంపింగ్ యార్డ్‌, వైకుంఠదామాలు వంటి అనేక కార్యక్రమాలున్నాయి. వాటి నిర్మాణాలకు నిధులు కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే, ఆయా పనులకు ఇసుక కొరత ఏర్పడింది. ఇందుకోసం సర్పంచ్‌లకు తగిన కూపన్లు ఇచ్చారు అధికారులు.

 

మధిరలోని ఎర్రుపాలెంలో ఇసుక ర్యాంపులున్నాయి. ఇసుకను తీసుకున్న సర్పంచ్‌లు ఆంధ్రా ప్రాంత రోడ్ల మీదుగా తెలంగాణకు తీసుకురావాలి. ఇప్పుడిదే సమస్యగా మారిపోయింది. ఇసుక తెచ్చుకోవాలంటే వెయ్యీ 60 రూపాయల చలానా కట్టి అధికారుల అనుమతితో ఇసుక తెచ్చుకోవాలి.  అంతేకాదు గంపలగూడెం నుంచి వచ్చే మార్గంలో చెక్‌పోస్టుల వద్ద పోలీసులు నిలిపేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక తెచ్చుకుంటున్నా.. పోలీసులు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కల్లూరు ప్రాంత సర్పంచ్‌లు.

 

సమస్యను  సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకటవీరయ్య వద్దకు తీసుకెళ్లారు స్థానిక నేతలు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్‌ను సమస్య పరిష్కరించాలని కోరారు. మొత్తం మీద.. ఇసుక సమస్య పరిష్కరించకపోతే తెలంగాణలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పాడింది. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలంటున్నారు గ్రామాల ప్రజలు. మొత్తానికి చెక్ పోస్ట్ ల వద్ద ఇసుక తరలింపు గొడవ చిలికిచిలికి గాలివానలా మారుతోంది. అధికారులు ఈ వ్యవహారంపై చొరవ చూపితే తప్ప.. సమస్య మరింత ఉధృతమయ్యేలా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: