నాగర్ కర్నూలులో ప్రభుత్వ పాఠశాలలో కుక్కకు ఇల్లు... ఫైన్ల డబ్బుతో నిర్మించిన హెడ్ మాస్టర్... !
సాధారణంగా ఎవరికైనా కుక్కను పెంచుకోవాలంటే ఇంట్లో పెంచుకుంటారు. ఎవరైనా పాఠశాలలలో కుక్కను పెంచుకుంటున్నారంటే అది సొంత పాఠశాల ఐతే మాత్రమే పెంచుకుంటారు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కుక్కకు ఇల్లు కట్టి మరీ ప్రధానోపాధ్యాయురాలు కుక్కను పెంచుతున్నాడు. వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఈ ఘటన నిజంగానే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది.
నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దొండ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ ఆవరణలో కుక్కకు ఇల్లు కట్టించారు. ప్రధానోపాధ్యాయురాలు నాగమణి పిల్లల దగ్గర ఫైన్ల రూపంలో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో కుక్కకు ఇంటిని నిర్మించారు. వెల్దొండ మండల గ్రామస్థులు ఈ కుక్క పెంపుడు కుక్క అని చెబుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలు తన ఇంట్లో కుక్కను చూసుకోవడానికి ఎవరూ అందుబాటులో ఉండకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అందువలన ప్రధానోపాధ్యాయురాలు నాగమణి పాఠశాలలోనే కుక్కకు ఇల్లు కట్టించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సెలవుల జరిమానాలతో నాగమణి కుక్కకు ఇళ్లు నిర్మించారు. సాధారణంగా పండగ సెలవులు ముగిసినా పిల్లలు ఒకటీ రెండు రోజులు స్కూలుకు ఎక్కువగా హాజరు కారనే విషయం తెలిసిందే. తరగతులు జరగవని కొందరు బంధువుల ఇంటికి వెళ్లి ఆలస్యంగా పాఠశాలకు హాజరవుతూ ఉంటారు.
ఇలా పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన పిల్లల నుండి ప్రధానోపాధ్యాయురాలు ఫైన్లను వసూలు చేశారు. తన కుక్కకు ఫైన్లు వసూలు చేసిన డబ్బులతో షెడ్డుతో కూడిన ఇంటిని నిర్మించారు. బాలల హక్కుల సంఘం దృష్టికి కొందరు ఈ ఘటన గురించి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ప్రధానోపాధ్యాయురాలు చేసిన పనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల ఫైనతో కుక్కకు ఇల్లు కట్టించటం ఏమిటి అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.