అమరావతిలో 4,800 గజాలు కొన్నానని ఒప్పుకున్న టీడీపీ నేత... !
ఈరోజు జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజధానిలో ఉన్న తన భూముల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రాజధానిని ప్రకటించిన 40 రోజుల తరువాత తాను భూములను కొన్నానని పయ్యావుల కేశవ్ అన్నారు. తనకూ ఒక ఇల్లు రాజధానిలో ఉండాలని అనుకున్నానని పయ్యావుల కేశవ్ అన్నారు.
బినామీల పేరుతో తాను భూములు కొనుగోలు చేయలేదని తన కుమారుల పేరుతోనే భూములు కొన్నానని పయ్యావుల కేశవ్ చెప్పారు. బినామీ భూముల గురించి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బినామీ చట్టాన్ని తీసుకొచ్చారని పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బినామీలు ఉంటే వెంటనే సీజ్ చేసే అధికారం ఉందని పయ్యావుల స్పష్టం చేశారు.
2014 సెప్టెంబర్ 1వ తేదీ ఏపీ కేబినేట్ రాష్ట్ర రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుందని సెప్టెంబర్ 4వ తేదీన 2014 సంవత్సరం రాజధాని గురించి చర్చ జరిగిందని అన్నారు. అక్టోబర్ 13వ తేదీ 2014వ సంవత్సరం 4,800 గజాలు
భూములు కొనుగోలు చేయడం జరిగిందని పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో భూములు ఎవరెవరు కొనుగోలు చేశారో బుగ్గన ఆధారాలతో సహా చూపగా పయ్యావుల కేశవ్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం బినామీ చట్టానికి సంబంధించిన కాపీ లేదేమో బినామీ యాక్ట్ కాపీని పంపుతున్నానని చెప్పారు. బినామీ చట్టం ద్వారా ఆస్తులను జప్తు చేయండని అన్నారు. అమరావతిలో ఎక్కడైతే బినామీ ప్రాపర్టీలు ఉన్నాయని అనుకుంటున్నారో ఆ జాబితాను కేంద్రానికి పంపించండి. బినామీ చట్టం ద్వారా ఆస్తుల్ని జప్తు చేయండి. బినామీ భూములను అమ్మి రాష్ట్ర ఖజానాకు ఇవ్వాలని పయ్యావుల సూచించారు.