సరిహద్దుల్లో వణికించేస్తున్న మంచుచరియలు !
మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడుతున్నాయి. జనం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకూ హిమపాతాల కారణంగా వందకుపైగానే జనం మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. రోడ్లపైనే మంచు చరియలు విరిగిపడుతున్నాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
పాకిస్థాన్... ఇండియా... ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడుతున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనల్లో వంద మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే జమ్మూ-కాశ్మీర్‌లో ఆరుగురు సైనికులు సహా పన్నెండు మంది చనిపోయారు. సోన్ మార్గ్ తో పాటు మాఛిల్ సెక్టార్లో మంచు పెళ్లలు విరిగిపడ్డాయి. మంచు చరియల ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
కాశ్మీర్లో హిమపాతం మనుషుల్ని బలి తీసుకుంటోంది. నియంత్రణ రేఖ దగ్గర మంచు చరియలు విరిగిపడటంతో... ఓ బీఎస్ఎఫ్ జవాను చనిపోయాడు. ఆరుగుర్ని మాత్రం సైన్యం రక్షించింది. సోన్ మార్గ్ కులన్ గ్రామంపై మంచు చరియలు విరిగిపడటంతో... ఐదుగురు పౌరులు మరణించారు. మాచిల్ సెక్టార్లో జరిగిన దుర్ఘటనలో నలుగురు సైనికులు చనిపోగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే సైన్యం రెస్క్యూ ఆపరేషన్లో నలుగురు సైనికుల్ని గుర్తించింది. వీరిలో ముగ్గురు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతనికి స్థానిక ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నియంత్రణ రేఖ వెంబడి నౌగామ్ సెక్టార్లో జరిగిన దుర్ఘటనలో ఓ సైనికుడు చనిపోగా.. ఆరుగుర్ని రక్షించారు. జమ్ముకశ్మీర్లో ఎత్తైన ప్రాంతాలు, లడఖ్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తుంటే.. మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అటు...హిమాచల్ ప్రదేశ్‌లో మంచుతో నిండిన ప్రకృతి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. గత కొంత కాలంగా కురుస్తున్న మంచు కారణంగా రహదారులన్నీ మూసుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. తాజాగా కొందరు పర్యాటకులు కిన్నౌర్ జిల్లాలోని టింకు నల్లా ప్రాంతంలో అందాలను తిలకించేందుకు వెళ్లారు. వారు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచు చరియలు రోడ్డుపై పడ్డాయి. వాటిని చూసేందుకని వాహనాల నుంచి కిందకు దిగిన వారి వైపునకు మంచు చరియలు రావడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ దృశ్యాన్ని వారు తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేశారు. అయితే మంచు వారిని వెంటాడుతున్నట్లుగా మరింత ముందుకు రావడంతో వారిలో ఒక పర్యాటకుడు వెనక్కి పో అంటూ అరిచాడు. అది మరింత ముందుకు రావడంతో భయంతో కొంతమంది తమ వాహనాలు ఎక్కి కూర్చున్నారు.
మరికొందరు మాత్రం కదులుతున్న మంచు చరియను తమ కెమెరాల్లో వీడియో తీస్తూ వెనక్కి పరుగెత్తారు. దీనికి సంబంధించిన వీడియోని నవీద్ ట్రుంబో అనే ఐఆర్‌ఎస్ అధికారి తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలా మంచు చరియలు కదలడం చూడలేదని అన్నారు. మొత్తానికి...హిమపాతం వందల కొద్దీ ప్రాణాలను బలి తీసుకుంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.