సచివాలయాల్లో 16,207 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మార్చిలో రాత పరీక్ష... ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,207 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీ జరగనుండగా వార్డు సచివాలయాల్లో 2,146 ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఈరోజు సాయంత్రం నుండి ఆన్ లైన్ లో గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు జనవరి 31వ తేదీ వరకు అభ్యర్థులు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు.
2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ చేసిన విషయం విదితమే. 2019 లో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. గ్రామ సచివాలయ నోటిఫికేషన్ లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్5 61, వీఆర్వో గ్రేడ్2 246, ఏ.ఎన్.ఎం గ్రేడ్3 648 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
గ్రామ మత్స్య శాఖ అసిస్టెంట్ 69, గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్ 1782, గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుడు గ్రేడ్2 536, గ్రామ సెరికల్చర్ సహాయకుడు 43, గ్రామ సంరక్షణ కార్యదర్శి 762, ఇంజనీరింగ్ సహాయకుడు 570, డిజిటల్ అసిస్టెంట్ 1134, విలేజ్ సర్వేయర్ గ్రేడ్3 1255, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ 97, పశు సంవర్ధక శాఖ సహాయకుడు 6,858 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వార్డు సచివాలయాల్లో వార్డు పరిపాలనా కార్యదర్శి 105, వార్డు వసతుల కార్యదర్శి 371, వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి 513, వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 100, వార్డు ప్రణాళిక, రెగ్యులేషన్ కార్యదర్శి 844, వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి 213 పోస్టుల భర్తీ జరగనుంది. అభ్యర్థులు wardsachivalayam.ap.gov.in , gramasachivalayam.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.