కారులో పోరు రీ సౌండ్ వస్తుందే ?
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ లో చేరిన నాయకులు, మొదటి నుంచి టిఆర్ఎస్ లో ఉన్న నాయకుల మధ్య టికెట్ల పంపిణీ విషయంలో ఆధిపత్య పోరు నెలకొంది. తమ అనుచరులకు టికెట్లు ఇవ్వాలంటూ కొందరు, లేదు తాము సూచించిన వారికే టిక్కెట్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేల పైన, నియోజకవర్గం ఇంచార్జీలపైనా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. చాలా చోట్ల సీనియర్ నాయకుల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం కనిపించకపోవడంతో పార్టీలోని కొత్త, పాత నాయకుల మధ్య వర్గ పోరు తీవ్రస్థాయిలో ముదిరిపోయింది. ఈ వ్యవహారం టిఆర్ఎస్ అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా మారింది.
ఒకటి రెండు చోట్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలో తెలియని అయోమయ పరిస్థితి టిఆర్ఎస్ అధిష్టానానికి ఏర్పడింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది కీలక నాయకులు టిఆర్ఎస్ లో చేరిపోయారు. అలాగే టిడిపి నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య సైతం టీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇలా టిఆర్ఎస్ లో చేరిన నాయకుల నియోజకవర్గాల పరిధిలో గ్రూపు రాజకీయాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
ఇటీవల జరిగిన పార్టీ ఇన్చార్జిల సమావేశంలో తాండూరు, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో టికెట్ల కేటాయింపులో ఎదురయ్యే ఇబ్బందులను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ప్రస్తావించారు. కొత్తగూడెం, కాగజ్ నగర్, ఎల్లారెడ్డి, చిట్యాల, వైరా మరికొన్ని చోట్ల ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మొత్తం 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా 30 కి పైగా నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ కు ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులు, కార్యకర్తలు తమకు టిక్కెట్లు కేటాయించాల్సిందిగా ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు.
ఈ వ్యవహారం కత్తి మీద సాములా మారడంతో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దెందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మున్సిపాలిటీల పరిధిలో పార్టీ పరిస్థితి, ఎవరెవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనే విషయంపై పార్టీ ఇంచార్జిల నుంచి నివేదికలను కెసిఆర్ తెప్పించుకుంటున్నారు. వార్డులు , డివిజన్, చైర్మన్ పదవులు రిజర్వేషన్ వివరాలు దృష్టిలో పెట్టుకుని గ్రూపులతో సంబంధం లేకుండా టికెట్లు కేటాయించాలని కెసిఆర్ సూచిస్తున్నారు.
ఇక కొల్లాపూర్, తాండూరు, కొత్తగూడెం తదితర మున్సిపాలిటీల్లో పోరు తీవ్ర స్థాయిలో ఉంది. తమకు టికెట్ దక్కని నేపథ్యంలో ప్రత్యేక ప్యానల్ గా ఏర్పడడమో, లేక రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేని ఏదైనా పార్టీ గుర్తుపై పోటీ పోటీ అయినా చేస్తామని మరికొంతమంది హెచ్చరికలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జనవరి 2వ తేదీన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో జరిగే భేటీలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అసమ్మతి, బుజ్జగింపు వ్యవహారాలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.