ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.... సచివాలయాల ద్వారా 500కు పైగా ప్రభుత్వ సేవలు....!

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శక పాలనే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీలో జనవరి 1వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటే పలు సేవలు అందబోతున్నాయి. ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలను అందించటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. 
 
ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యంతో పాటు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, సిమ్ కార్డులు, ల్యామినేషన్ యంత్రాలను సమకూర్చింది. విద్యుదీకరణ పనులు ఇప్పటికే 80 శాతానికి పైగా గ్రామ, వార్డు సచివాలయాలలో పూర్తయినట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ సౌకర్యం ఇప్పటికే 50 శాతానికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కల్పించారు. 
 
అధికార యంత్రాంగం ఈరోజు నుండి ఆన్ లైన్ ద్వారా ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు సాగించడానికి సన్నద్ధమవుతోంది. అధికార వర్గాలు ఈ మేరకు ఇప్పటికే అన్ని చర్యలను చేపట్టాయి. అధికార వర్గాలు జనవరి 1వ తేదీ నుండి గ్రామ, వార్డ్ సచివాలయాలలో పూర్తి స్థాయి పాలనా వ్యవహారాలను కొనసాగించనున్నట్టు చెబుతున్నాయి. ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు వైయస్సార్ నవశకం పేరుతో సర్వే పూర్తి చేశారు. 
 
ఆరోగ్యశ్రీ తుది జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఈరోజు ఆమోదించనున్నారు. ఆమోదం తరువాత జనవరి 1వ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ కానున్నాయి. 500కు పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. 47 రకాల సేవలు 15 నిమిషాల్లో పూర్తయ్యేలా 148 రకాల సేవలు 72 గంటల కంటే తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా 311 రకాల సేవలను 72 గంటల తరువాత అందించవచ్చని అధికారులు గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల కోసం అధికారులు ప్రత్యేకమైన పోర్టల్ ను రూపొందిస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: