ఈ నరరూప రాక్షసుడికి ఏమీ తెలియదట..!
హాజీపూర్ వరుస హత్యలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ తుది దశకు చేరుకుంది. వంద మందికి పైగా సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకు అనుగుణంగా నిందితుడు శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు న్యాయమూర్తి. తుదుపరి విచారణను జనవరి 3కు వాయిదా వేసింది కోర్టు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన హాజీపూర్ వరుస హత్యాచారం కేసుల్లో విచారణ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో శరవేగంగా సాగుతోంది. నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. ట్రయిల్‌లో భాగంగా కీలకమైన సీఆర్పీఎఫ్ సెక్షన్ 313 కింద నిందితుడిని ప్రశ్నించారు న్యాయమూర్తి. ఈ కేసులో మొత్తం 101 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. సాక్షులు చెప్పిన వాంగ్మూలాల ఆధారంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రశ్నలు రూపొందించింది. నిందితుడు శ్రీనివాసరెడ్డిపై ఈ ప్రశ్నలు సంధించారు న్యాయమూర్తి. నిందితుడు చెప్పిన ఒక్కో సమాధానాన్ని కోర్టు నమోదు చేసింది. అయితే న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు తనకేం తెలియదని సమాధానంగా చెప్పాడు శ్రీనివాసరెడ్డి. మనీషా కేసుకు సంబంధించి 29 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలపై ప్రశ్నించారు జడ్జి.
కీలకమైన 313 విచారణ వరకూ రావడంతో.. కేసు తుది దశకు చేరుకున్నట్లే. ఇప్పటికే ఫోరెన్సిక్, సైంటిఫిక్ ఆధారాలను కోర్టు పరిశీలించింది. దిశ హత్యాచారం కేసులోని నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో.. హాజీపూర్ ఘటనల్లోనూ నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో హాజీపూర్ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాగుతోంది. చంద్రశేఖర్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు. అక్టోబర్ 14న విచారణ మొదలైంది. ఈ రెండున్నర నెలల వ్యవధిలో మొత్తం 40 రోజులపాటు కోర్టు విచారణ జరిగింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్వయంగా కోర్టుకు హాజరై ఈ కేసులోని సాక్ష్యాధారాలను సమర్పించారు. ఎంతో భవిష్యత్తున్న ముగ్గురు అమాయక అమ్మాయిలను పొట్టనబెట్టుకున్న ఈ నరరూప రాక్షసుడు తనకేమీ తెలియదని విచారణలో చెప్పాడు. ఎంత వీలైతే అంత త్వరగా ఈ నీచుడిని చంపేయాలని బాధితుల బంధులు కోరుతున్నారు.