జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్.... ప్రకటించిన కాంగ్రెస్...!
క్షణక్షణానికి జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మారిపోతున్నాయి. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి 42 స్థానాలలో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో లీడింగ్ లో ఉండగా బీజేపీ పార్టీ మాత్రం 28 స్థానాలలో లీడ్ లో కొనసాగుతుంది. కాంగ్రెస్ కూటమి నేతలు జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్ సోరేన్ అని ప్రకటించారు. కాంగ్రెస్ కూటమి , బీజేపీ పార్టీలు చిన్న పార్టీలైన ఏజేఎస్యూ, జేవీఎంలతో చర్చలు జరుపుతున్నాయి.
కానీ ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు హంగ్ ఏర్పడితే ఎవరికి మద్దతు తెలుపుతారనే విషయాన్ని ప్రకటించలేదు. స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రి రఘు బర్ దాస్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన హేమంత్ సోరేన్ రెండు స్థానాల నుండి పోటీ చేశారు. ఈ రెండు స్థానాలలో ఒక స్థానంలో హేమంత్ ముందంజలో ఉండగా మరో స్థానంలో మాత్రం వెనుకంజలో ఉన్నారు.
జేవీఎం 4 స్థానాలలో, ఏజేఎస్యూ 2 స్థానాలలో, ఇతరులు నాలుగు స్థానాలలో ముందంజలో ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ప్రభంజనంతో బీజేపీ పార్టీకి జార్ఖండ్ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది. లెక్కింపు పూర్తయ్యే సరికి జేఎంఎం అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. గతంతో పోల్చుకుంటే బీజేపీ ఓటు షేరింగ్ లో పుంజుకున్నా సీట్ల విషయంలో మాత్రం జేఎంఎం ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది.
మహారాష్ట్ర రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ జార్ఖండ్ లో కూడా అపజయం దిశగా పయనిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ముందుగానే బీజేపీ పార్టీ జార్ఖండ్ లో గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్ లో హరియాణాలో దెబ్బ తిన్నారు... మహారాష్ట్రలో వద్దనిపించుకున్నారు... జార్ఖండ్ లో ఓడిపోయారు. 2019 బీజేపీ పార్టీ కథ ఇది అని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ దీనిపై దృష్టి పెట్టాలని
చెప్పారు.