బీహార్ సీఎం ఏంటీ..! బీజేపీకి ఇలా షాకిచ్చారే.. !
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ... ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షాల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. తమ రాష్ట్రంలో ఎన్నార్సీని అమలు చేయబోమంటూ... బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేసి బీజేపీకి షాకిచ్చారు.
బీజేపీకి మిత్రపక్షం జేడీయూ షాకిచ్చింది. పౌరసత్వ సవరణ చట్టానికి పార్లమెంటు వేదికగా మద్దతు తెలిపిన ఆ పార్టీ... ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఈ కొత్త చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతుండటంతో... జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వెనుకడుగు వేశారు. ముస్లింలకు తాను అండగా ఉండానంటూ కీలక వ్యాక్యలు చేసిన ఆయన... ఎన్నార్సీని తమ రాష్ట్రంలో అమలు చేయబోమంటూ మరోమారు సంచలన వ్యాక్యలు చేశారు.
అటు కేంద్ర ప్రభుత్వం.. సీఏఏ, ఎన్నార్సీలను దేశవ్యాప్తంగా అమలుచేసి తీరుతామని చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదని హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే బీహార్‌లో మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్న నితీశ్‌కుమార్.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీకి మింగుడుపడని అంశంగా మారింది. తాజాగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ .. బీహార్‌లో ఎన్నార్సీని అమలు చేయాల్సిన అవసరం ఏముందన్నారు.
ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తూ ప్రకటన చేసిన తొలి ఎన్డీఏ భాగస్వామిగా జేడీయూ నిలిచింది. ఇటీవలే ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, పశ్చిమ్ బెంగాళ్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు ఎన్డీయేతర ముఖ్యమంత్రులు.. తాము ఎన్నార్సీకి వ్యతిరేకమని ప్రకటించారు. తమ రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు. నిరసనల్లోనూ పాల్గొంటున్నారు. తాజాగా, నితీశ్‌కుమార్ కూడా వారి సరసన చేరారు. దీంతో ఎన్నార్సీ, సీఏఏ చట్టాల అమలుపై పట్టుదలగా ఉన్న కేంద్రానికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయ్యింది.
ఇప్పటికే సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగానూ మారుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి.. నితీశ్‌కుమార్ ఊహించని షాక్ ఇచ్చారు. అయితే కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షంగా అంత యాక్టివ్‌గా లేనపోయిప్పటికీ.. బీహార్‌లో నితీశ్‌కుమార్ ఎన్డీఏ నాయకుడిగా ఉన్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం.. రెండు పార్టీల పొత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.