ప్రేమించిన వ్యక్తే లోకమని తల్లిదండ్రులకు దూరమైంది.... అంతలోనే అంతమైంది...!

Reddy P Rajasekhar

హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. తన తండ్రి దగ్గర పని చేసే ఒక యువకుడి ప్రేమలో పడిన యువతి అతని ఆలోచనలే లోకంగా బతికింది. ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లోని పెద్దలను కోరింది. పెద్దలు ఆ యువకుడితో వివాహానికి ఒప్పుకోలేదు. పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటంతో ఆ యువతి తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంది. 
 
పెళ్లైన 12 రోజుల్లోనే యువతి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యువతి ప్రస్తుతం ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుందని తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన ప్రసాద్ కుటుంబం హైదరాబాద్ నగరంలోని మోతీ నగర్ లో కొన్నేళ్లుగా నివాసం ఉంటోంది. ప్రసాద్ బాలానగర్ లో ఒక కంపెనీని నిర్వహిస్తూ ఉండగా అతని కూతురు పూర్ణిమ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసేది. 
 
తండ్రి కంపెనీలో పని చేసే కార్తీక్ తో ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి ప్రసాద్ కార్తీక్ ను ఉద్యోగం నుండి తొలగించాడు. పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటంతో పూర్ణిమ, కార్తీక్ నవంబర్ 22వ తేదీన సింహాచలంలో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 2వ తేదీన పూర్ణిమ మొబైల్ కు వచ్చిన మెసేజ్ ను డిలేట్ చేయడంతో గొడవ మొదలైందని తెలుస్తోంది. 
 
పోలీసులు పూర్ణిమ మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పూర్ణిమ తలపై గాయాలు ఉన్నట్లు, సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. సూసైడ్ నోట్ పూర్ణిమనే రాసిందా..? లేదా..? అనే విషయం తేల్చేందుకు సూసైడ్ నోట్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కూతురు మరణవార్త తెలియడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: