యాదాద్రిలో మహాపచారం... ఈవో, ప్రధాన అర్చకులు ప్రగతి భవన్ కు రావాలని ఆదేశం...!
యాదాద్రిలో మహాపచారం జరిగింది. స్వయంభువు విగ్రహాన్ని చెక్కి మార్పులు చేశారన్న వార్తపై కలకలం రేగుతోంది. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఆనందసాయి అనే ఆర్కిటెక్ట్ ఆధ్వర్యంలో యాదాద్రిని ఆలయ నగరంగా తీర్చిదిద్దుతున్నారు.
యాదాద్రిని మరింత ఆకర్షణీయంగా చేసే భాగంలో కొత్త నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. మూలవిరాట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్న గుహలో కూడా కొన్ని నిర్మాణాలు చేశారు. మూల విరాట్టును మరింత బాగా కనిపించాలని సంకల్పించారని ఈ పని కోసం మూడు నెలల క్రితం ఒక స్థపతిని పిలిపించగా స్వయంభువు విగ్రహాన్ని చెక్కడం మహా పాపమని మూల విరాట్టును తాకనే తాకనని ఆ స్థపతి చెప్పి వెళ్లిపోయాడని తెలుస్తోంది.
ఆలయంలో పని చేసే ఒక శిల్పి మూల విరాట్టును శాంతమూర్తి నుండి ఉగ్ర మూర్తిగా చెక్కినట్లు తెలుస్తోంది. 15 రోజుల క్రితం కొందరు ఈ వివరాలను చినజీయర్ స్వామికి తెలిపారని సమాచారం. చినజీయర్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేసి ఈవోను పిలిపించగా అలా ఏమీ చేయలేదని ఈవో చినజీయర్ స్వామికి చెప్పినట్లు సమాచారం. ఒక స్థపతి శాండ్ బ్లాస్టింగ్ మాత్రమే చేశారని చెప్పినట్లు సమాచారం.
యాదాద్రి ఈవో, ముగ్గురు ప్రధాన అర్చకులను ప్రగతి భవన్ కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మాజీ స్థపతి సుందరరాజన్ కు కూడా చెన్నై నుండి రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆగమ శాస్త్ర పండితులు మూల విరాట్టును చెక్కితే అది ముమ్మాటికి తప్పే అని చెబుతున్నారు. ప్రధాన అర్చకులు మాత్రం సింధూరం మాత్రం తొలగించామని ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. మూల విరాట్టును ఎప్పుడూ ఎవరూ ఉలితో చెక్కలేదని సింధూరం తొలగించటం వలనే స్వయంభువు కోరలు బయటపడి ఉగ్రరూపం కనిపిస్తోందని ప్రధాన అర్చకులు చెబుతున్నారు,