ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యం...!
ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. కొమరం భీం జిల్లా చింతల మనేపల్లి గ్రామంలో నిన్న ఇద్దరు బీట్ ఆఫీసర్లు ప్రాణహిత నదిలో గల్లంతయ్యారు. నది దాటుతూ ఉండగా నాటు పడవ మునిగిపోవటంతో బాలకృష్ణ, సురేష్ గల్లంతు అయ్యారు. వీరి కోసం నిన్నటినుండి ఎన్డీఆర్ ఎఫ్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు ఎన్డీఆర్ ఎఫ్ టీం మృతదేహాలను గుర్తించింది. బాలకృష్ణ, సురేష్ ఇద్దరూ కర్జెల్లి రేంజ్ కు చెందిన వారు.
కొద్దిసేపటి క్రితం పోలీసులు, అధికారులు సురేష్, బాలకృష్ణ మృతదేహాలు దొరికినట్లుగా ప్రకటించారు. నిన్న ఇద్దరు ఆఫీసర్లు గల్లంతయినప్పటి నుండి వీరి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వీరు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఇద్దరు ఆఫీసర్ల మృతితో ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన నాటు పడవలో మొత్తం ఎనిమిది మంది ఎక్కినట్లు తెలుస్తోంది.
పడవ నడిపిన వ్యక్తి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని అహేరి నుండి గూడెంకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక నీటి ప్రవాహంతో పడవలోకి నీరు చేరటంతో నదిలో ప్రమాదవశాత్తు నాటు పడవ మునిగిపోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గూడెం గ్రామంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మహారాష్ట్రలోని అహేరికి వెళ్లిన ఆఫీసర్లు పెద్ద పడవ అందుబాటులో లేకపోవడంతో చిన్న పడవలో వెళ్లారు.
నదీ ప్రవాహం వేగంగా ఉండటంతో పడవకు చిల్లులు పడి పడవ లోపలికి నీళ్లు వచ్చాయి. పడవలో ఎక్కువమంది ఉండటంతో పడవ బోల్తా పడింది. విషయం తెలిసిన స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈరోజు ఉదయం ఇద్దరు బీట్ ఆఫీసర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో బీట్ ఆఫీసర్ సద్దాం పడవలోకి నీళ్లు వస్తూ ఉండటంతో భయపడ్డామని సెకన్ల వ్యవధిలోనే అంతా జరిగిందని కళ్ల ముందే సురేష్, బాలకృష్ణ గల్లంతయ్యారని చెప్పాడు.