అధికార పార్టీలో అల్పపీడనం – తుఫానుగా మారే ప్రమాదం

 అధికార పార్టీ కాంగ్రేస్ లో అల్పపీడనం ఏర్పడింది. ఇది తుఫానుగా మారి రాష్ట్రంలో పార్టీని అతలాకుతలం చేసే అవకాశం ఉందని రాజకీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.       తాజాగా వెలుబడ్డ 18 ఉప ఎన్నికల పలితాల అనంతరం పార్టీలో రోజురోజుకు రాజుకుంటున్న అంతర్గత రగడ ఈపరిస్థితులకు అద్దం పడుతోంది. ఈఎన్నికల్లో ఘోరపరాభవానికి కారణం మీరంటే మీరని పార్టీలోని ప్రముఖనేతల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు పదునైన విమర్శలకు బాహాటంగానే దిగుతుండడంతో పరాభవపు ప్రభావం కన్నా ఇదే పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. పరువుతీయాల్సిన ప్రతిపక్షం పాత్రను స్వపక్ష నేతలే నిర్వహిస్తుండడంతో ఈవ్యవహారం అదిష్టానాన్ని కలవర పెడుతోంది.       మొదట ‘ఈ పలితాలు ఊహించినవే ...అయినా రాష్ట్ర నాయకత్వం చేసిన పొరపాట్లు కూడా దీనికి కారణమే‘ అంటూ ఏకంగా ఈ ఎన్నికల సంధర్బంగా పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జీగా నియమితులైన వీరప్పమొయిలీ ఢిల్లీ నుంచే బహిరంగంగా పేర్కొనడంతొ పార్టీలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం తాజాగా రాష్ట్రమంత్రి శైలజానాథ్ పార్టీలోని నేతలే పార్టీకి నష్టం చేశారు,వీరిపై పార్టీ నాయకత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నేతలకు పార్టీ ఇష్టం లేకుంటే పార్టీని వదిలిపెట్టాలని కూడా చేసిన వాఖ్యలతో పార్టీలో ఏర్పడ్డ అల్పపీడనం తుఫానుగా మారినట్లయింది.       వరంగల్ జిల్లా పరకాలలో ఓటమిని తెలంగాణ సెంటిమెంట్ కు ముడిపెడుతూ అటు టిఎంపీలు స్వరాన్ని పెంచారు. మాజీ పిసిసి అద్యక్షులు కేకే నివాసంలో సమావేశమై తాజాగా వ్యూహరచన చేసిన వీరు చేపట్టేపోయే కార్యక్రమాలు, వాఖ్యలు పార్టీ పరిస్థితిని మరింత పలుచన చేసే అవకాశాలు లేకపోలేదు. దీనికి తోడు ఒకరిపై ఒకరు విమర్శలకు కూడా దిగుతుండడం పార్టీని మరింత దిగజారుస్తోంది. ఉపఎన్నికల పలితాలపై సొంత సర్వే పలితాలు చెప్పిన విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ రాజకీయాలను వదిలి చిలకజోస్యం చెప్పుకోవాలని కాంగ్రేస్ ఎంపీల ఫోరం కన్వీనర్ కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్,వరంగల్ ఎంపి రాజయ్యలు విలేఖరుల సమావేశం పెట్టి మరీ విమర్శించడం మళ్లీ తెలంగాణ, ఆంధ్రానేతల మద్య పాత పరిస్థితులను సృష్టిస్తాయోమోనన్న ఆందోలన కూడా పార్టీ నాయకత్వంలో మొదలయింది.      ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల జిల్లాల్లో పార్టీనేతల మద్యరగడ రోజురోజుకు ముదురుతూనే ఉంది. మంత్రి శైలజానాథ్ తో సహా పలువురు నేతలు ఇప్పటికే ఓటమికి కారణం పార్టీలోనే ఉంటూ వైఎస్ఆర్ సీపికి సహకరించారంటూ,వీరిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టమంటూ బహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే మున్ముందు జగన్ పార్టీలోకి జంప్ జిలానీలు సిద్దమవుతున్నారన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా సి.ఎం.కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఈపరిణామాల పట్ల ఏమి మాట్లాడకుండా మౌనంగానే ఉన్నారు. పిసీసి అధ్యక్షుడు బొత్స,మరోఅగ్రనేత చిరంజీవి పలితాల పట్ల కాస్తా స్పందించినప్పటికి వారి వాఖ్యలు కూడా డీలాపడ్డ పార్టీ నేతలను,శ్రేణులను ఉత్సాహపరిచే విధంగా లేకపోవడం కూడా పార్టీ అధిష్టానాన్ని కలవర పెట్టించిందనవచ్చు.       రాష్ట్రపతి ఎన్నికల తర్వాతనే రాష్ట్రంలోని పరిస్థితులు,పలితాల విశ్లేషణ,బాద్యులపై స్పందించడం వంటివి ఉంటాయని తెలుస్తోంది. అప్పటి వరకు అల్పపీడనంతో మొదలై ఇప్పటిగా తుఫానుగా మారిన కాంగ్రేస్ పార్టీలోని అంతర్గత చిచ్చు సునామీగా మారే అవకాశాలు సైతం కన్పిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: