బీఎస్ఎన్ఎల్ .. వీఆర్ఎస్ స్కీమ్ కు ఊహించని స్పందన !

NAGARJUNA NAKKA
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ స్కీమ్ కు ప్రభుత్వం ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. దీంతో ఇంతమంది వెళ్లిపోతే.. సంస్థ ఎలా నడుపుతారో చెప్పాలని టెలికాం డిపార్ట్ మెంట్.. బీఎస్ఎన్ఎల్ ను కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించింది. 


ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించిన తర్వాత.. ఇప్పటివరకూ దాదాపు 70వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం లక్షన్నర మంది ఉద్యోగుల్లో లక్షమంది వరకూ వీఆర్‌ఎస్‌కు అర్హులు. వీరిలో 77వేల మందిని వీఆర్‌ఎస్‌ కింద పంపాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ప్రకటించిన వీఆర్ఎస్ పథకం జనవరి 31, 2020 వరకూ అందుబాటులో ఉంటుంది.


ఇప్పటికే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 70వేలకు చేరింది. ఉద్యోగుల నుంచి విశేష స్పందన వస్తోందని బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం చెబుతోంది. ఇంతమంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌ కింద పంపిస్తే.. రోజువారీ వ్యాపార కార్యకలాపాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యాన్ని టెలికాం విభాగం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని టెలిఫోన్‌ ఎక్సేంజీల్లో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని నిర్దేశించింది. 


2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌ శాశ్వత, రెగ్యులర్‌ ఉద్యోగులు.. డిప్యుటేషన్‌పై వేరే సంస్థలకు వెళ్లినవారు కూడా వీఆర్ఎస్ కు అర్హులే. వీఆర్ఎస్ కు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా ఆకర్షణమీయంగానే ఉంది. సర్వీస్‌ పూర్తిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల చొప్పున, ఇంకా ఉన్న పదవీ కాలానికి సంబంధించి ఏడాదికి 25 రోజుల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. వీఆర్ఎస్ స్కీమ్ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇంకేముందీ జనవరి 31వరకే గడువు ఉండటంతో ఎంప్లాయిస్ దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: