అమ్మో..! చంద్రబాబు ఏం ప్లాన్ వేశారు ?
చాలా కాలం తర్వాత హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు... తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెస్తాన్నారు. ఇకపై ప్రతివారం పార్టీ ఆఫీసుకు వస్తానని... కార్యకర్తలకు అండగా ఉంటానంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇంతకీ నాయకులే లేని పార్టీని చంద్రబాబు ముందుండి ఎలా నడపనున్నారు..? ఆయన వ్యూహం ఏంటనే దానిపై ఇపుడంతా ఆసక్తిగా మారింది.
చాలా కాలం తర్వాత తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. వాస్తవానికి ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక... పూర్తిగా అక్కడికే పరిమితమైపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారం రోజుల కేటాయించినా... ప్రచారానికే పరిమితమయ్యారు చంద్రబాబు. అయితే అప్పటికే చాలా మంది నాయకులు టీఆర్ఎస్ లో చేరి పోయారు. మిగిలిన వాళ్లు ఈ మధ్య బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంత జరిగినా తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కార్యకర్తల్లో జోష్ నింపారు. నేనున్నాను పార్టీని కాపాడతాను సహకరించండి అంటూ పిలుపునిచ్చారు.
కీలక నాయకులంతా వెళ్ళిపోయారు... క్యాడర్ కూడా పెద్దగా లేదు.. తెలంగాణాలోని చాలా జిల్లాల్లో కార్యకర్తలు లేని పరిస్థితి. కానీ పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ ఫుల్ జోష్‌తో మాట్లాడారు చంద్రబాబు. దీంతో ఏ నమ్మకంతో చంద్రబాబు తెలంగాణాలో పార్టీకి పూర్వ వైభవం తెస్తానంటున్నారనే చర్చ సాగుతోంది. టీడీపీ పుట్టిందే హైదరాబాద్‌లో అనీ... ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. తెలంగాణలో టీడీపీ ఉండటం సామాజిక అవసరమన్నారు చంద్రబాబు. అందువల్లే ఇకపై ప్రతి శనివారం తెలంగాణలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతానని ప్రకటించారు. అంతేకాదు ప్రతి ఒక్క కార్యకర్తను కలుస్తానని... వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని పరిశీలిస్తానన్నారు బాబు. నాయకులు వెళ్లిపోవడం టీడీపీకి కొత్త కాదనీ... ఎవరు పోయినా.. కార్యకర్తలు మిగిలే ఉన్నారన్నారు చంద్రబాబు. పార్టీకి అన్ని స్థాయిల్లో సమర్థవంతమైన నాయకులను నియమించి... తెలంగాణలో పూర్వవైభవం తీసుకువస్తాన్నారు.
టీడీపీని బలోపేతం చేసేందుకు బ్యాక్ ఆఫీస్ కమిటీ వేయనున్నారు. జిల్లాలు, మండలాల్లో సమర్థవంతమైన నాయకులకు బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేయనున్నారు. అంతేకాదు హైదరాబాద్ అభివృద్దికి బీజం వేశానని చెప్తూనే...టీడీపీపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి రావాలి పిలుపునిచ్చారు చంద్రబాబు. మొత్తానికి 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు... టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.