ఇక శత్రువులను చీల్చిచండాడవచ్చు.. ఎందుకంటే?
మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది డి.ఆర్.డి.ఓ. మూడవ తరానికి చెందిన ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది. దీంతో డి.ఆర్.డి.ఓ శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిసింది.
దేశ సరిహద్దుల్ని శత్రు దుర్భేద్యంగా మార్చే దిశగా మరో అడుగు వేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ ఆర్గనైజేషన్ - డి.ఆర్.డి.ఓ. రెండున్నర కిలో మీటర్ల దూరంలో గల శత్రుసేనల యుద్ధ ట్యాంక్‌లను తుత్తునీయలు చేయగల మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్- ఎం.పి.ఎ.టి.జి.ఎమ్. ను విజయవంతంగా పరీక్షించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో క్షిపణి ప్రయోగం జరిగింది. ఇండియన్ ఆర్మీ సహకారంతో జరిగిన ఈ పరీక్ష కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. ట్రైపాడ్‌పై అమర్చిన లాంచర్ నుంచి ప్రయోగించిన క్షిపణి...నిర్ధేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది.
ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది డి.ఆర్.డి.ఓ. ఈ క్షిపణి చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి వాహనాలు అవసరం లేకుండా సైనికులు తమకు అనువైన చోటుకు ఈ క్షిపణి తీసుకెళ్లి ప్రయోగించే అవకాశం ఉండడమే దీని ప్రత్యేకత. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్‌లో ఇది మూడవ తరానికి చెందిందని డి.ఆర్.డి.ఓ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎమ్.పి.ఎ.టి.జి.ఎమ్.. పరీక్ష విజయవంతం కావడంతో డి.ఆర్.డి.ఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
మొత్తానికి మన దేశ రక్షణ వ్యవస్థ నానాటికీ అభివృద్ది చెందుతోంది. శత్రువులను చీల్చిచెండాడే ఆయుధం మన అంబుల పొదిలో చేరింది. పరీక్ష విజయవంతం కావడంతో అందరూ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. అనుక్షణం దేశ రక్షణను ఆకాంక్షించే మన సైనికులకు తాజా ప్రయోగం ఎంతో మేలు చేకూర్చనుంది.