చంద్రబాబు మీద క్రిమినల్ కేసా ?

Vijaya

చంద్రబాబునాయుడు మీద క్రిమినల్ కేసు పెట్టాలా ? బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు డిమాండ్ చేస్తుంటే అలాగే అనిపిస్తోంది అందరికీ. ప్రజాధనాన్ని లూటి చేసిన వాళ్ళపై రాష్ట్రప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ జివిఎల్ చేసిన డిమాండ్ సంచలనంగా మారింది. ప్రజాధనం లూటికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉండే ఉంటాయి కాబట్టి లూటి చేసిన వాళ్ళపై వెంటనే కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేశారు.

 

రాజధాని అమరావతిని  బ్రహ్మాండంగా నిర్మించామని చంద్రబాబు చెప్పుకోవటంలో అర్ధమే లేదన్నారు. ఎందుకంటే తాత్కాలిక భవనాలు తప్ప ఇంకేమీ కనబడటం లేదని ఎంపి ఎద్దేవా చేశారు. స్విస్ చాలెంజ్ అని, సింగపూర్ చాలెంజ్ అని చెప్పి వేల కోట్ల రూపాయలు చంద్రబాబు దుర్వినియోగం చేసినట్లు జివిఎల్ మండిపోయారు.

 

రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేల కోట్ల రూపాయల్లో కొంత మాత్రమే ఖర్చు చేసి మిగిలినదంతా చంద్రబాబు తన జేబులో వేసుకున్నట్లు ఆరోపించారు. 5 వేల ఎకరాల్లో నిర్మించగలిగిన రాజధానిని చంద్రబాబు అనవసరంగా వేలాది ఎకరాలను సమీకరించినట్లు దుయ్యబట్టారు.  చదరపు అడుగుకు పది వేల రూపాయల వ్యయం చేయటంలోనే ప్రజాధనం ఏ స్ధాయిలో లూటి జరిగిందో అందరికీ అర్ధమైపోతోందన్నారు.

 

ఇక పోలవరం నిర్మాణంలో జరిగిన అవినీతిని కూడా ప్రభుత్వం బయటపెట్టాలంటూ జివిఎల్ డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది.  రూ 5800 కోట్ల హెడ్ వర్క్స్ పనులను విడదీసి మూడు కంపెనీలకు ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటో తేల్చాలన్నారు. ఇందులో రూ. 2346 కోట్ల అధికంగా చెల్లింపులు జరిగినట్లు చెబుతున్న జివిఎల్ ఎవరు చెబితే అధికారులు ఎక్కువ చెల్లింపులు జరిపారో బయటకు చెప్పాలంటూ డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.  పోలవరం, రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ లో జరిగిన అవినీతిని ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం విచారణ జరిపించాలని జివిఎల్ డిమాండ్ చేయటం గమనార్హం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: