అమెరికా ట్రంప్ ట్రంపరితనానికి అదుపే లేదు. ప్రస్తుతం ట్రంప్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రాగన్‌పై టారిఫ్‌ల కత్తులు దూస్తునే... రెండు దేశాల ట్రేడ్‌వార్ విషయంలో పశ్చాత్తాపడుతున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు. ఒక పక్క పశ్చాత్తాపపడుతునే... ట్రేడ్‌వార్‌ని మరింత పెంచేందుకు వెనకాడబోనని హెచ్చరించారు ట్రంప్.
అమెరికా ఫస్ట్ నినాదంతో దూసుకొచ్చిన డొనాల్డ్ ట్రంప్... అధ్యక్షుడు అయిన దగ్గరి నుంచి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. చైనా విషయంలో అయితే, ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఒకరి వస్తువులపై మరొకరు సుంకాలు విధించుకుంటూ కవ్వించుకుంటున్నాయి అగ్రరాజ్యాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్య మేఘాలు కమ్ముకోవడానికి ఈ రెండు దేశాల ట్రేడ్‌వారే కారణం. చైనా విషయంలో దూకుడుగా ఉన్న ట్రంప్ అనూహ్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో అల్పాహార విందు సందర్భంగా...చైనాతో వాణిజ్య యుద్ధం విషయంలో పశ్చాత్తాప పడుతున్నట్టు చెప్పారు.
చైనాతో వాణిజ్య యుద్ధానికి దిగినందుకు పశ్చాత్తాప పడుతున్నాననీ, అయితే ప్రతిదానికి తన దగ్గర ప్రత్యామ్నాయం ఉందని తెలిపారు ట్రంప్. ఒక పక్క పశ్చాత్తాప పడుతూనే చైనా ఇదే విధంగా దుందుడుగా వ్యవహరిస్తే.. వాణిజ్య యుద్ధాన్ని మరింత పెంచేందుకు తాను వెనకాడబోనని హెచ్చరించారు. చైనాలోని అమెరికా కంపెనీలను వెనక్కి రప్పించే సామర్థ్యం తనకు ఉందున్నారు ట్రంప్. కానీ.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితులు బాగానే ఉండటంతో ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు.
కొద్ది రోజులుగా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. అమెరికా ఉత్పత్తులపై డ్రాగన్ సుంకాలు పెంచితే.... తామేమీ తక్కువ కాదంటూ చైనా ఉత్పత్తులపై 5 శాతం టారిఫ్‌లను పెంచింది అగ్రరాజ్యం. ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నా.. ఇలా అగ్రరాజ్యాలు వాణిజ్య యుద్ధం చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు ఆర్థికవేత్తలు.