టెక్నాలజీ.. టెక్నాలజీ అంటూ బాబు టీమ్ ఇంత దోచేసిందా..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన ఎప్పుడూ టెక్నాలజీ గురించే మాట్లాడేవారు. హైటెక్ పద్దతుల్లో ఆధునికంగా పరిపాలన సాగిస్తానని చెప్పుకునే వారు. ఆర్జీజీఎస్ వంటి ఆధునిక వ్యవస్థలను ఆయన రూపొందించారు కూడా. ఈ విషయంలో చంద్రబాబు ముందుచూపును మెచ్చుకోవాల్సిందే.


అయితే అదే సమయంలో టెక్నాలజీ పేరుతో చంద్రబాబు హయాంలో దోపిడీ కూడా భారీగానే జరిగిందట. అప్పట్లో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ అనే ఓ భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పల్లెకూ.. పల్లెలోని ప్రతి ఇంటికీ కేబుల్ గ్రిడ్ వ్యవస్థ ద్వారా కేబుల్ టీవీ, ఇంటర్ నెట్, ఫోన్ సౌకర్యం అన్నీ కేవలం 149 రూపాయలే ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. దీన్ని చూసి అప్పట్లో ఔరా చంద్రబాబు అనుకున్నారు.


కానీ ఆ పథకం నిర్వహణలో అంతులేని అవినీతి చోటుచేసుకుందట. ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటులో వెయ్యి కోట్ల రూపాయల పైనే అవినీతి జరిగిందని ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంటున్నారు. శాసనసభలో ఈ అంశంపై ఎమ్మెల్యేలు జోగి రమేష్, ఆళ్ల రామకృస్ణారెడ్డి వేసిన ప్రశ్నలపై ఆయన ఇలా జవాబు ఇచ్చారు.


పైబర్ నెట్ కనెక్సన్ 149 రూపాయలు అని ప్రచారం చేశారని... కాని సెట్ ఆప్ బాక్స్ లు మాత్రం ఐదు వేల రూపాయల చొప్పున వసూలు చేశారని మంత్రి అసెంబ్లీలో వివరించారు. నిజానికి మార్కెట్ లో ఈ బాక్స్ లు కేవలం 3500 రూపాయలకే దొరుకుతున్నాయట. కానీ చంద్రబాబు సర్కారు మాత్రం ప్రజల నుంచి ఐదువేల రూపాయలు వసూలు చేశారట.


చంద్రబాబు సర్కారు అవినీతి బాగోతాలన్నీ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్ సర్కారు.. ఇప్పుడు ఈ ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవినీతిని కూడా బయటపెట్టే ప్రయత్నాల్లో ఉంది. మంత్రివర్గ ఉప సంఘం ఈ వ్యవహారం మొత్తాన్ని జల్లెడ పడుతోంది. ఫైనల్ గా ఎంత అవినీతి జరిగిందనే ఆ తర్వాతే తేలుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: