టీడీపీకి ఆ నేత గుడ్ బై..! జగన్ అమెరికా వెళ్లొచ్చాక వైసీపీలోకి..?
టీడీపీకి మరోషాక్ తగలబోతోంది. ఆ పార్టీ నుంచి మరో నేత బయటకు వెళ్లిపోతున్నారు. అయితే ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు అంతా బీజేపీలో చేరుతుంటే.. ఈయన మాత్రం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. ఈయన ఒక్కడే కాదట.. తనతో పాటు తన కుమారుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ తోపాటు తమ క్యాడర్ అంతా వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారట.
ఇంతకీ ఆ నేత ఎవరంటారా...? ఆయనే కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. వీరశివారెడ్డి కమలాపురం నియోజకవర్గానికి గతంలో మూడు సార్లు ఎన్నికయ్యారు. తన నిష్క్రమణను కన్ ఫామ్ చేసిన వీరశివారెడ్డి.. వెళ్తూ వెళ్తూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు ప్రజాస్పందను పట్టించుకోలేదని.. తనకు నచ్చినవారు... ఓటమిలో బౌండరీలు కొడుతున్నా వారికే టికెట్లు ఇచ్చారని వీరశివారెడ్డి ఆరోపించారు. అందుకే టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. చంద్ర బాబు ఓ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అయ్యారని వీర శివారెడ్డి అంటున్నారు. కడప జిల్లా అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వీరశివారెడ్డి చెప్పారు.
టీడీపీలోకి వెళ్లే ముహూర్తాన్ని కూడా వీరశివారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వీరశివారెడ్డి ప్రకటించారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటన అనంతరం వైఎస్సార్ సీపీలో చేరతారట.
ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాను వైసీపీ స్వీప్ చేసేసింది.. మొత్తం పది స్థానాలకు పది స్థానాల్లోనూ విజయ బావుటా ఎగరేసి తనకు ఎదురు లేదని నిరూపించుకుంది. అందులోనూ కడప జగన్ సొంత జిల్లా.. గతంలో వచ్చిన ఒకటీ ఆరా సీట్లు కూడా రాకపోవడంతో కడప జిల్లాలో తెలుగుదేశం నాయకులు పూర్తి నైరాశ్యంలో ఉన్నారు. అందుకే తమ భవిష్యత్ కోసం వైసీపీకి జై కొడుతున్నారు.