ఏపీలో బంపర్ మెజారిటీతో వైసిపి ప్రభుత్వం ఏర్పడింది. వైసిపి అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రధానంగా జగన్ కేబినెట్ ఎలా ఉంటుంది అన్న అంశం మీదే ఉంది. జగన్ కేబినెట్ ఏర్పాటు ఈ నెల 7, 8 తేదీలలో ఉంటుందని తెలుస్తోంది. తొలి విడతలో భాగంగా 13 జిల్లాల నుంచి 15 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని ఆ తర్వాత జరిగే విస్తరణలో మిగిలిన వారికి చోటు కల్పిస్తారని తెలుస్తోంది. తొలి విడతలో కేబినెట్‌లో చోటు దక్కించుకునేందుకు వైసీపీలోని సీనియర్లు, కీలక నేతలు ఇప్పటికే లాబీయింగ్ స్టార్ట్ చేసేశారు. జగన్ ఎన్నికల ప్రచారంలో కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులపై హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, మంగళగిరిలో లోకేష్ పై గెలిచిన రామకృష్ణారెడ్డి, ఒంగోలు నుంచి గెలిచిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి మాత్రం తాను కేబినెట్‌లో చోటు ఇస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ముగ్గురికి జగన్ కేబినెట్‌లో చోటు ఖాయం కానుంది. ఇదిలా ఉంటే కేబినెట్‌లో కొందరికి చోటు కల్పించాలని ఇప్పటికే జగన్‌కు కొందరు రికమండేషన్లు చెయ్యడం స్టాట్ చేసినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్‌కు ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. జగన్‌కు ఒకానొక దశలో సొంత కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేకంగా ఉన్న పిల్లి బోస్ మాత్రం ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. జగన్ కోసం మంత్రి పదవి కూడా వదులుకున్న ఆయన 2012, 2014 ఎన్నికలలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆయన తన సొంత నియోజకవర్గం అయిన రామచంద్రపురం కాదని మండపేట నుంచి జగన్ ఆదేశాల మేరకు పోటీ చేసి మూడోసారి ఓడిపోయారు.
ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి విడతలోనే కేబినెట్‌లోకి తీసుకోవాలని విజయలక్ష్మి జగన్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు కుడిభుజంగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తొలి విడతలోనే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జగన్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డికి తొలి విడతలో మంత్రి పదవి ఖాయం అయిన ఓ కీలక శాఖను ఆయనకు ఇవ్వాలని విజయసాయిరెడ్డి జగన్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి ఆ కీలక శాఖపై పెద్దిరెడ్డి కన్నేసినట్టు ఫలితాలు వచ్చినప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అంటూ కూడా ఇప్పటికే మీడియాలో వార్తలు కూడా జోరుగా వైరల్ అయ్యాయి. ఇక గుంటూరు జిల్లాలో సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవిపై జగన్ హామీ ఇచ్చిన సొంత పార్టీలోనే ఆయనకు అడ్డుపుల్లలు వేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం మర్రికి మంత్రి పదవి ఇవ్వాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. చిలకలూరిపేటలో మర్రికి మంత్రి పదవి వచ్చే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు వాళ్ల స్వయంగా మర్రిని కలిసి ఆయనకు మంత్రి పదవి ఖాయమైందని ప్రకటన చేసిన విషయం కూడా తెలిసిందే. ఏదేమైనా వీరితోపాటు ఫైనల్ కేబినెట్ రెడీ అయ్యే సమయానికి మరికొంతమంది పదవుల కోసం భారీ ఎత్తున లాబీయింగ్ చేయడంతో పాటు... పార్టీ అధినేతకు కొంతమంది ద్వారా రికమెండేషన్లు చేయించుకుంటారు అనడంలో సందేహం లేదు.